PM Modi Assets: భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రతి ఏడాది తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తున్నారు. 2021-22 సంవత్సరంలో మోదీ చరాస్తుల విలువ రూ. 26.13 లక్షలు పెరిగినట్టు పీఎంఓ వెబ్సైట్ వెల్లడించింది. గుజరాత్ రెసిడెన్షియల్ ప్లాట్‌లో ఆయనకు ఉన్న వాటాను విరాళంగా ఇచ్చారని, దీంతో ఆయన పేరిట ఎలాంటి స్థిరాస్తులు లేవని పేర్కొంది. మోదీతో పాటు పలు కేంద్ర మంత్రుల ఆస్తుల జాబితాను ప్రకటించింది.
మార్చి 31, 2022 వరకు మోదీ చరాస్తుల విలువ రూ.2,23,82,504కు చేరిందని పీఎంఓ తెలిపింది. ఇందులో డిపాజిట్ల పెరుగుదల, ఆర్థిక సంస్థ స్థిరత్వం, నేషన్‌వైడ్ ఫైనాన్షియల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లు, జీవిత బీమా కవరేజ్, బీమా పాలసీలు, నగదు ఉన్నాయని చెప్పింది.
పీఎంఓ వివరాల ప్రకారం..మోదీకి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లేవు. సొంత వాహనం కూడా లేదు. ప్రభుత్వం నుంచి పొందే జీతాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టడం, వాటి వల్ల వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల ఆయన ఆదాయంలో వృద్ధి ఎక్కువగా కనిపిస్తోందని తెలుస్తోంది. రూ.1.73 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఆయన చేతిలో ఉన్న నగదు విలువ తగ్గింది. గతంలో ఈ నగదు విలువ రూ. 36,900 ఉండగా అది రూ.35,250కు చేరింది.