PM Modi Assam Rally: అసోం కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా దిఫులో 'శాంతి, ఐక్యత, అభివృద్ధి' పేరుతో నిర్వహించిన ర్యాలీకి హాజరయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆరోగ్య, విద్యా రంగానికి సంబంధించిన వెటర్నరీ కాలేజ్, డిగ్రీ కాలేజ్, అగ్రికర్చర్ కాలేజీ వంటి ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలను ఉద్దేశించి సభలో మాట్లాడారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటు ఇతర భాజపా నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
"అసోం అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉంది. రూ.1000కోట్లు విలువ చేసే ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపన జరిగింది. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అభివృద్ధి, నమ్మకమే మా విధానం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ లక్ష్యంతోనే ముందుకుసాగుతున్నాం. అసోంలోని 23 జిల్లాలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(AFSPA) తొలగించాం. ఈశాన్యంలో శాంతి భద్రతలు మెరుగపడినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం. సబ్కా సాత్, సబ్కా వికాస్ స్ఫూర్తితోనే సరిహద్దు సంబంధిత సమస్యలకు పరిష్కారాలు వెతుకుతున్నాం. అసోం, మేఘాలయ మధ్య కుదిరిన ఒప్పందం ఇతరులనూ ప్రోత్సహిస్తుంది. అసోంను శాశ్వతంగా శాంతియుత రాష్ట్రంగా మారుస్తాం. "