కరోనా నిబంధనలు పాటించేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కేంద్ర మంత్రులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. మూడో దశ మహమ్మారి రాకుండా.. ప్రజలంతా టీకాలు తీసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రుల సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మంత్రులు తాము మొదలు పెట్టిన ప్రాజెక్టులను తామే పూర్తి చేసి, ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని తెలిపారు. ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలని, ఎలాంటి ఆలస్యం లేకుండా వేగంగా పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. దాదాపు 5 గంటలపాటు మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. నీతి ఆయోగ్ సభ్యుడు వీకేపాల్.. కరోనా వైరస్ తీరుతెన్నులపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. వైరస్ కట్టడికి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మోదీ ఈ సమావేశంలో సూచించారు.