తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై దాడులు బాధాకరం'.. ఆ దేశ ప్రధానితో మోదీ - ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాల దాడులపై మోదీ

ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల పట్ల విచారం వ్యక్తం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆ దేశ ప్రధాన మంత్రితో ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.

modi albanese meeting
modi albanese meeting

By

Published : Mar 10, 2023, 2:32 PM IST

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంటోనీ ఆల్బనీస్​తో దిల్లీలో శుక్రవారం భేటీ అయ్యారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఇరుదేశాల సంబంధాల బలోపేతంపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో ఉన్న హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాన్ని లేవనెత్తారు ప్రధాని మోదీ. గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో ఉన్న హిందూ దేవాలయాలపై తరచూ దాడులు జరుగుతున్నాయని.. ఇలాంటి వార్తలు భారత్​లోని ప్రతిఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఆస్ట్రేలియా ప్రధానికి తెలియచేయగా.. భారతీయుల రక్షణ తమ ప్రాధాన్యం అని ఆల్బనీస్​ హామీ ఇచ్చారని మోదీ తెలిపారు. ఇరు దేశాలు రక్షణ రంగంలో అనేక ఒప్పందాలు చేసుకున్నామని.. సమగ్ర ఆర్థిక ఒప్పందంపై కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఆస్ట్రేలియా-భారత్​ సమగ్ర ఆర్థిక ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తామని.. ఈ ఏడాది చివర వరకు పూర్తయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్​ సముద్ర భద్రత అంశంపైనా చర్చించినట్లు వివరించారు.

అంతకుముందు రాష్ట్రపతి భవన్​లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్​కు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. అక్కడ ఆల్బనీస్​ సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఉదయం రాజ్​ఘాట్​ వెళ్లిన ఆస్ట్రేలియా ప్రధాని.. మహాత్మా గాంధీ సమాధికి నివాళులు అర్పించారు. ఇదే సమయంలో ఆస్ట్రేలియా, భారత్ మంచి స్నేహితులని ఆస్ట్రేలియా ప్రధాని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య రోజురోజుకు భాగస్వామ్యం మరింత బలపడుతోందని.. ఇలాగే కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్కృతి, ఆర్థిక సంబంధాలు, భద్రతా రంగంలో సహకారం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. క్రికెట్ మైదానంలో ఇరుదేశాలు పోటీపడుతున్నాయి కానీ.. 2 దేశాలు కలిసి మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తున్నాయని పేర్కొన్నారు. మోదీ, ఆల్బనీస్​ ద్వైపాక్షిక చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలను పెంపొందించడం కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు.

ఇరు దేశాల ప్రధాన మంత్రులకు జ్ఞాపికల అందించిన బీసీసీఐ
బోర్డర్ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్​కు హాజరయ్యారు ఇరుదేశాల ప్రధానమంత్రులు. ఈ సందర్భంగా రెండు దేశాల ప్రధానులకు.. వారి దేశానికి ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్లతో కూడిన చిత్రపటాలను అందించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్​కు బీసీసీఐ ప్రెసిడెంట్​ రోజర్ బిన్నీ అందించగా.. భారత ప్రధాని మోదీకి బీసీసీఐ సెక్రటరీ జై షా ఇచ్చారు.

బీసీసీఐ అందించిన జ్ఞాపిక

ఇవీ చదవండి :విద్యార్థి ప్రాణాలు తీసిన డేర్​ గేమ్.. పోటాపోటీగా ఐరన్ ట్యాబ్లెట్స్ మింగి మృతి

నడిరోడ్డుపై భార్యను వదిలి నవవరుడు జంప్​.. పెళ్లైన మరుసటి రోజే.. మాజీ లవర్​ వేధింపులే కారణం..!

ABOUT THE AUTHOR

...view details