కొవిడ్-19 మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మన తలుపు తట్టిందన్న విషయాన్ని ప్రతిఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారిని ఓడించటంలో వ్యక్తిగత అప్రమత్తత, క్రమశిక్షణ అతిపెద్ద బలమని సూచించారు. కరోనా టీకా పంపిణీలో భారత్ అపూర్వమైన ఘనత సాధించిందని.. అయితే, కొత్త వేరియంట్లు పుట్టుకోస్తున్న నేపథ్యంలో కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
2021 ఏడాదిలో చివరి, 84వ మనసులో మాట(మన్ కీ బాత్) కార్యక్రమంలో మాట్లాడారు మోదీ.
"ఈ కొత్త ఒమిక్రాన్ వేరియంట్‌ను మన శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రతి రోజు.. వారు కొత్త సమాచారాన్ని సేకరిస్తున్నారు. వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. కొత్త వేరియంట్‌పై పోరాటంలో వ్యక్తిగత అప్రమత్తత, క్రమశిక్షణే దేశానికి అతిపెద్ద బలం. సమష్టి కృషితోనే కరోనాపై విజయం సాధిస్తాం. ఆ బాధ్యతతోనే మనం 2022లోకి అడుగుపెట్టాలి."