Telangana Autistic Singer Kamishetty Venkat :ఈ రోజుల్లో అన్ని అవయవాలు బాగున్నా.. ఏ పని చేసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు చాలా మంది. తను అలా కాదంటున్నాడు ఈ కడప కుర్రాడు. ఆటిజంతో బాధపడుతున్నా.. మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తున్నాడు. పలు అవార్డులు అందుకున్నాడు. ఇటీవలప్రధాని మోదీ వరంగల్ పర్యటనలో ముందు నాటు నాటు పాటకు ఆడిపాడి.. ప్రశంసలు, మన్ననలు అందుకున్నాడు.
President Award for Autistic Singer Venkat :కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన వెంకట్ పుట్టినప్పటి నుంచే ఆటిజంతో బాధ పడుతుండేవాడు. 2 కిలోల బరువుతో పుట్టి.. చర్మం ముడతలు పడి.. అసలు పిల్లాడిలో కదలికలు లేవని తల్లిదండ్రులు విశాలాక్షి, రాధాకృష్ణయ్య వివరించారు. ఎన్ని నెలలైనా ఎదుగుదల లేదు.. రోజుకు 18 గంటలు ఏడ్చేవాడని తెలిపారు. రకరకాల ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల చుట్టూ తిరిగే వారమన్నారు. అయినా ఫలితం లేకపోవడంతో ఇలాంటి పిల్లాడిని ఎందుకు భరిస్తున్నారని.. ఎక్కడైనా వదిలేయండని చాలా మంది ఉచిత సలహాలు ఇచ్చేవారని చెప్పారు.
Autistic Singer Telangana :ఎవరెన్నిమాటలు చెప్పినా తమ పేగుబంధం ఒప్పుకోక.. తన కొడుకును తాను తీర్చి దిద్దుతానంటూ తల్లి విశాలాక్షి ప్రయత్నం మొదలు పెట్టింది. అందుకే ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు లేరంటారు. అందుకే ఈ అమ్మ ప్రేమ ముందు ఆటిజం కూడా వెనక్కి తగ్గింది. సైగలు చేయడం. తర్వాత పెదాలతో ఒక్కో అక్షరం పలికించడం నేర్పింది ఈ యోధురాలు.
"అందరి అమ్మల్లాగే నేను కూడా నాకు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కన్నాను. కానీ నాకు పుట్టిన అబ్బాయికి ఆటిజం ఉందనే విషయం తెలిసి బాధ పడ్డాను. రోజుకు 18 గంటలు ఏడుస్తూనే ఉండేవాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. ఏడుస్తున్నప్పుడు ముఖం మొత్తం ముడతలు పడిపోయేది. అది చూసి ఎంతో బాధ పడేదాన్ని. నా కొడుకు విషయంలో నా భర్త నాకు ఎంతో సాయపడ్డారు. నన్ను ఎంతో ప్రోత్సహించి ఇప్పుడు నా పిల్లాడిని ఈ స్థాయికి తీసుకువచ్చేలా చేశారు. "- విశాలాక్షి, వెంకట్ తల్లి