PM meet with CM: భారత్లోని 130 కోట్ల ప్రజల సమష్టి కృషితో.. కరోనా మహమ్మారిపై తప్పక విజయం సాధిస్తామని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని అన్న ప్రధాని.. మనం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అయితే.. ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేశారు. పండగల సమయంలో జాగ్రత్తగా ఉంటూ నిబంధనలు తప్పక పాటించాలని నొక్కిచెప్పారు.
ఒమిక్రాన్ ప్రభావంతో దేశంలో కొవిడ్ వ్యాప్తి ఆందోళనకర స్థాయికి చేరిన నేపథ్యంలో రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, వ్యాక్సినేషన్ మొదలైన విషయాలపై చర్చించారు.
దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోందని, 10 రోజుల్లోనే 3 కోట్లకుపైగా టీనేజర్లకు టీకా అందించడం అభినందనీయమని అన్నారు. ఇదే భారత సామర్థ్యాన్ని తెలుపుతోందని తెలిపారు.