తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆపరేషన్ టీకా: ఒకే రోజు 3 సంస్థలకు మోదీ - నరేంద్ర మోదీ లేటెస్ట్​ న్యూస్​

దేశంలో అభివృద్ధి చేస్తున్న మూడు కరోనా టీకాల గురించి ఆరా తీయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందుకోసం సీరం, జైడస్​ క్యాడిలా, భారత్​ బయోటెక్ సంస్థలను శనివారం స్వయంగా సందర్శించనున్నారు. వ్యాక్సిన్ పనితీరు, ఉత్పత్తి, పంపిణీకి సన్నద్ధత వంటి విషయాలను సమీక్షించనున్నారు.

PM likely to visit Serum Institute to take stock on development of Corona vaccine
కరోనా టీకాలపై ఆరా తీయనున్న మోదీ

By

Published : Nov 27, 2020, 5:34 PM IST

కరోనా వ్యాక్సిన్ కోసం యావత్​ దేశం ఆశగా ఎదురుచూస్తోన్న నేపథ్యంలో శనివారం కీలక పర్యటన చేపట్టనున్నారు మోదీ. భారత్​లో కరోనా టీకా అభివృద్ధి చేస్తున్న సీరం, జైడస్​ క్యాడిలా, భారత్ బయోటెక్ సంస్థలను సందర్శించనున్నారు. వ్యాక్సిన్​ పనితీరు, ఉత్పత్తి, పంపిణీకి ఏర్పాట్లు వంటి అంశాలను స్వయంగా సమీక్షించనున్నారు.

మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రధాని కార్యాలయం ట్విట్టర్​ ద్వారా వెల్లడించింది. కరోనాపై పోరులో భారత్ నిర్ణయాత్మక దశకు చేరుకున్న తరుణంలో వ్యాక్సిన్ సన్నద్ధతపై శాస్త్రవేత్తలతో చర్చించేందుకు మోదీ ఈ పర్యటన చేపడుతున్నారని పేర్కొంది. టీకా అభివృద్ధి, ఎదుర్కొంటున్న సవాళ్లు, దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్​ను అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలను సమీక్షిస్తారని పేర్కొంది.

మొదట జైడస్​..

పర్యటనలో భాగంగా మొదట గుజరాత్​లోని జైడస్​ క్యాడిలా ప్లాంట్​ను సందర్శిస్తారు మోదీ. అహ్మదాబాద్​కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛంగోదర్ పారిశ్రామిక ప్రాంతానికి శనివారం ఉదయం 9:30 గంటలకు చేరుకుంటారు.

జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేస్తున్న 'ZyCoV-D' టీకా ప్రస్తుతం రెండో దశ ప్రయోగాల్లో ఉంది. ఆగస్టులో మొదటి దశ ప్రయోగాలు పూర్తయ్యాయి.

సీరం సందర్శన..

సీరం సంస్థను సందర్శించేందుకు అహ్మదాబాద్​ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు పుణె చేరుకుంటారు ప్రధాని. ఆస్ట్రాజెనెకా, ఆక్స్​ఫర్డ్​తో కలిసి సీరం సంస్థ అభివృద్ధి చేస్తున్న 'కొవిషీల్డ్' వ్యాక్సిన్​కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటారు. టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, పంపిణీకీ సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆరా తీస్తారు.

సీరం సంస్థ తయారు చేస్తున్న ఈ టీకా రెండు దశల ప్రయోగాలు పూర్తయ్యాయి. మూడో దశ ట్రయల్స్​ కోసం అధికారిక ప్రక్రియ పూర్తయింది. ఐసీఎంఆర్​తో కలిసి దేశవ్యాప్తంగా 15 నగరాల్లో 1600మంది వలంటీర్లపై ట్రయల్స్​ నిర్వహించేందుకు సీరం సంస్థ సిద్ధమైంది. వచ్చే ఏడాది మొదటి వరకు ఈ టీకా అందుబాటులోకి వస్తుందని అంచనాలున్నాయి. ఆరోగ్య సిబ్బంది, సీనియర్ సిటిజన్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ టీకా రెండు డోసులకు కలిపి ధర గరిష్ఠంగా రూ.1000 ఉంటుందని సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ఇప్పటికే తెలిపారు. 2024 నాటికి దేశంలోని ప్రతిఒక్కరికీ టీకా చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్​ బయోటెక్​కు..

పుణె నుంచి హైదరాబాద్​కు మధ్యాహ్నం చేరుకుంటారు మోదీ. భారత్​ బయోటెక్​ 'కొవాగ్జిన్' టీకా అభివృద్ధి కేంద్రాన్ని సందర్శిస్తారు. గంటపాటు అక్కడే ఉండి వ్యాక్సిన్​కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం దిల్లీకి బయలుదేరుతారు.

కొవాగ్జిన్ టీకాపై ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్​ జరుగుతున్నాయి.

పర్యటన సందర్భంగా వ్యాక్సిన్​కు సంబంధించి మోదీ కీలక ప్రకటన చేస్తారేమోనని సరత్వా ఆసక్తి నెలకొంది.

ఇదీ చూడండి: 'ఆ రెండు టీకాల్ని కలిపితే మెరుగైన ఫలితం!'

ABOUT THE AUTHOR

...view details