మహారాష్ట్రలో ప్రముఖ పుణ్యక్షేత్రం పండర్పుర్లో రెండు రోడ్డు ప్రాజెక్టుల పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పల్లకీ మార్గ్ (NH-965), శ్రీ సంత్ తుకారాం మహారాజ్ పల్లకీ మార్గ్‌లో(NH-965G) నాలుగు లైన్ల రహదారి పనులను ప్రారంభించారు. ఈ రహదారులకు ఇరువైపులా భక్తులు నడిచేందుకు కాలినడక మార్గాన్ని కూడా నిర్మించనున్నారు.
పండర్పుర్ను దేశంలోనే స్వచ్ఛమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని ప్రజలు తనకు మాటివ్వాలని మోదీ కోరారు. పల్లకీ మార్గ్ దారిలో చెట్లు నాటి, భక్తులకు తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. పండర్‌పుర్ ఆనందం, శ్రేయస్సుకు ప్రతీక అని, ఈ ప్రాంతానికి అనుసంధానిస్తూ 225కి.మీ జాతీయ రహదారి నిర్మాణాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.