గత ప్రభుత్వాలు.. ఉత్తర్‌ప్రదేశ్‌ను అంధకారంలోకి నెట్టాయని, భాజపా పాలనలో ప్రస్తుతం రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 'డబుల్ ఇంజిన్' పాలనతో రాష్ట్రంలో భాజపా తనదైన ముద్ర వేస్తోందన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ జెవార్‌లో నిర్మించనున్న విమానాశ్రయానికి ప్రధాని మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు.
"కొంతమంది.. వారికి, వారి కుటుంబాలకు ప్రయోజనం కలగాలని ఆలోచిస్తారు. కానీ మేము అలా కాదు. మౌలికవసతులు అనేది మాకు రాజకీయాలు కావు. జాతీయ విధానంతో సమానం. ప్రాజెక్టులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకుంటున్నాము. 'సబ్కా సాత్, సబ్కా వికాశ్, సబ్కా విశ్వాస్- సబ్కా ప్రయాస్' అనేది మా మంత్రం. 7 దశాబ్దాల్లో తొలిసారిగా.. యూపీ కలలు సాకారమవుతున్నాయి. గత ప్రభుత్వాలు ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చాయి. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రం.. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ మంచి గుర్తింపు పొందుతోంది."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.