రైతులకు గుడ్న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు పంపించనున్నారు. పీఎం కిసాన్ యోజనలో భాగంగా సోమవారం 8 కోట్ల మంది ఖాతాల్లోకి రూ.16,800 కోట్లు జమా చేయనున్నారు. రబీ సీజన్ ప్రారంభానికి ముందు రైతులకు పెట్టుబడి సాయంగా ఇది ఉపయోగపడనుంది. కర్ణాటకలోని బెళగావిలో నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొని.. మోదీ ఈ నిధులు విడుదల చేస్తారని ఓ అధికారిక ప్రకటన ద్వారా కేంద్రం తెలిపింది. పీఎం కిసాన్, జల్జీవన్ మిషన్ లబ్ధిదారులు సహా లక్ష మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా సైతం కార్యక్రమంలో భాగం కానున్నారని తెలిపింది.
రైతులకు పెట్టుబడి సాయంగా పీఎం-కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లోకి రూ.6వేలు జమా చేస్తోంది. నాలుగు నెలలకు ఒకసారి రూ.2వేలు చొప్పున మూడు విడతల్లో ఈ నిధులను విడుదల చేస్తోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు వెళ్లిపోతుంది. 2018 డిసెంబర్లో తొలుత ఈ పథకాన్ని ప్రారంభించారు. 2019 ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. 2022 మేలో 11వ విడత, అక్టోబర్లో 12వ విడత సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి వేశారు.