విధ్వంసక శక్తులు, ఉగ్రవాదం ద్వారా అధికారం చెలాయించాలనే భావజాలాన్ని నమ్మే వ్యక్తులు కొంత కాలం ఆధిపత్యం చలాయించినా, వారి ఉనికి శాశ్వతం కాదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మానవత్వాన్ని ఎప్పటికీ అణచివేయలేరని స్పష్టం చేశారు. గుజరాత్లోని చారిత్రక సోమనాథ్ ఆలయానికి చెందిన రూ.83 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను వర్చువల్గా శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
అఫ్గానిస్థాన్లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న క్రమంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.
" సోమనాథ్ ఆలయాన్ని చాలా సార్లు ధ్వంసం చేశారు. విగ్రహాలను అపవిత్రం చేశారు. ఆలయ ఉనికిని రూపుమాపేందుకు ప్రయత్నాలు జరిగాయి. దాడి జరిగిన ప్రతిసారీ రెట్టింపు వైభవాన్ని ప్రదర్శించింది. అది మనకు ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుంది. విధ్వంసాన్ని సృష్టించే మూకలు, ఉగ్రవాద సిద్ధాంతాలతో రాజ్యస్థాపన నమ్మే వ్యక్తులు కొంత కాలం ఆధిపత్యం చలాయించవచ్చు. కానీ, వారి ఉనికి శాశ్వతం కాదు. అది గతంలో సోమనాథ ఆలయం ధ్వంసం చేసిన సమయాల్లో నిజమని తేలింది. ఇప్పుడు కూడా అదే నిజం "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.