PM Degree Case :ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం తిరస్కరించింది సర్వోన్నత న్యాయస్థానం. గుజరాత్ విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పరువునష్టం కేసులో తమపై చర్యలు తీసుకోకుండా స్టే విధించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్. దీనిని పరిశీలించిన హైకోర్టు.. స్టేకు నిరాకరించింది. దీంతో కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ప్రస్తుతం ఈ కేసు గుజరాత్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని.. ఆగస్టు 29న హైకోర్టే తీర్పు వెలువరిస్తుందని స్పష్టం చేసింది. కేజ్రీవాల్‌తో పాటు గుజరాత్ విశ్వవిద్యాలయం కూడా వారి వాదనలను అక్కడే చెప్పుకోవాలని సూచించింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించగా.. గుజరాత్ విశ్వవిద్యాలయం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు.
PM Degree Row : అంతకుముందు ఆగస్టు 11న.. తమపై చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలంటూ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో వీరికి వ్యతిరేకంగా మెట్రోపాలిటన్ కోర్టు తీసుకుంటున్న చర్యలపై స్టే ఇవ్వబోమని స్పష్టం చేసింది. మరోవైపు ఈ పరువు నష్టం కేసులో విచారణ కోసం ఆగస్టు 11న మెట్రోపాలిటన్ కోర్టుకు రావాలని గతంలో కోర్టు వీరికి సమన్లు జారీ చేసింది. అయితే, ఈ సమన్లను సవాల్ చేస్తూ వీరిద్దరూ సెషన్స్ కోర్టులో రివిజన్ అప్లికేషన్ దాఖలు చేశారు. వీరి అభ్యర్థనను సెషన్స్ కోర్టు తిరస్కరించడం వల్ల గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడా ఊరట లభించలేదు.