తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ వైపు ప్రపంచం ఉత్సాహంగా చూస్తోంది: మోదీ - కేరళ పర్యటనలో మోదీ

భారత్ వైపు గొప్ప ఉత్సాహం, సానుకూల దృక్పథంతో ప్రపంచం చూస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడు, కేరళలో వేలాది కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టారు. సృజనాత్మక ఉత్పత్తులపై అంకుర పరిశ్రమలు దృష్టి సారించాలని సూచించారు.

PM dedicates to nation BPCL's petro-chem complex in Kerala
'భారత్ పెట్రోలియం'ను జాతికి అంకితం చేసిన మోదీ

By

Published : Feb 14, 2021, 5:21 PM IST

Updated : Feb 14, 2021, 6:19 PM IST

వచ్చే మార్చి-ఏప్రిల్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తమిళనాడు రాజధాని చెన్నైలో రూ. 3.77 కోట్లతో చేపట్టిన మెట్రో రైలు తొలి దశ విస్తరణ ప్రాజెక్టును ఆదివారం ప్రారంభించారు. చెన్నై-అట్టిపట్టు మధ్య నాలుగో రైల్వే లైను, పలు రైల్వే లైన్ల విద్యుదీకరణ పనులు, గ్రాండ్‌ అనికట్‌ కాలువ వ్యవస్ధను జాతికి అంకితం చేశారు.

అనుసంధానత అవసరం..

రూ.1000 కోట్లతో నిర్మించనున్న ఐఐటీ మద్రాస్‌ పరిశోధనా సముదాయానికి కూడా ప్రధాని శంకుస్ధాపన చేశారు. ప్రాంతాల మధ్య అనుసంధానత.. ప్రజల జీవన విధానాన్ని సులభతరం చేయడం సహా వ్యాపారాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని తెలిపారు. తర్వాతి తరాల మనుగడకు నీరు కీలకం అని అన్నారు. తక్కువ జలంతో ఎక్కువ పంట పండించే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.

"ప్రపంచం గొప్ప ఉత్సాహం, సానుకూల దృక్పథంతో భారత్ వైపు చూస్తుంది అన్నది నిజం. ఈ దశాబ్దం భారత్‌ది కాబోతోంది. దీనికి కారణం 130 కోట్ల మంది భారతీయుల కఠిన శ్రమ, చెమట. ప్రజల ఆకాంక్షలు, నవకల్పనలకు మద్దతు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంస్కణల విషయంలో భారత ప్రభుత్వ అంకితభావాన్ని ఈ ఏడాది బడ్జెట్ మరోసారి చాటిచెప్పింది."

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

అభివృద్ధి దిశగా కేరళ మరింత..

అనంతరం.. కేరళలో ప్రధాని పర్యటించారు. కొచ్చిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రూ.6,000 కోట్లతో నిర్మించిన భారత్‌ పెట్రోలియం.. పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ను జాతికి అంకితం చేశారు. కొచ్చిన్‌ పోర్ట్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో చేపట్టిన అంతర్జాతీయ క్రూయజ్‌ టెర్మినల్‌ సహా మెరైన్‌ ఇంజనీరింగ్‌ శిక్షణా సంస్ధను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి దిశగా కేరళ మరింత ముందుకు సాగుతుందని ప్రధాని తెలిపారు. గత అయిదేళ్లలో దేశంలో పర్యటక రంగం మరింత అభివృద్ధి సాధించిందని వెల్లడించారు.

కరోనా నేపథ్యంలో ప్రజలు స్ధానిక పర్యటక ప్రాంతాలకు వెళ్లేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న మోదీ.. ఈ అంశాన్ని వినియోగించుకుని అంకుర సంస్ధలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు సృజనాత్మక ఉత్పత్తులపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

"సృజనాత్మక పర్యటక ఉత్పత్తుల గురించి ఆలోచించాలని అంకుర పరిశ్రమలకు చెందిన యువ వ్యాపారవేత్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రస్తుత సమయాన్ని వినియోగించుకుని మీకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సాధ్యమైనంతగా ఎక్కువగా పర్యటించాలని కూడా నేను కోరుతున్నాను. గత అయిదేళ్లలో భారత్‌లో పర్యటక రంగం చాలా బాగా అభివృద్ధి చెందుతుందని తెలిస్తే మీకు సంతోషం కల్గుతుంది. ప్రపంచ పర్యటక సూచిలో భారత్‌ ర్యాంకింగ్‌ 65 నుంచి 34కు చేరింది. కానీ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. "

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

పర్యటక రంగంలో భారత్‌ ఇంకా మెరుగుపడగలదని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:'అసోంను విడదీసేందుకు భాజపా-ఆర్​ఎస్​ఎస్ కుట్ర'

Last Updated : Feb 14, 2021, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details