బంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్ వెల్లడించారు. ఈ మేరకు తనతో ఫోన్లో మాట్లాడారన్నారు. రాజకీయ హింస, హత్యలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు గవర్నర్. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా అభివర్ణించారు. రాష్ట్రంలోని చట్టవిరుద్ధ చర్యలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగాలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
" బంగాల్లో హింస, విధ్వంసం, హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. వివేకంలేని రాజకీయ హింస ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. ఎన్నికల తర్వాత బంగాల్లోనే హింస ఎందుకు? ప్రజాస్వామ్యంపై దాడి ఎందుకు?"
-- జగదీప్ ధనకర్, బంగాల్ గవర్నర్
ఇదీ చదవండి :బంగాల్లో రాజకీయ హింస.. ముగ్గురు మృతి
నాజీ పాలన..
బంగాల్లో చెలరేగిన రాజకీయ హింసాత్మక ఘటనలను కలకత్తా హైకోర్టు సుమోటా తీసుకుని విచారణ చేపట్టాలని భాజపా నేత స్వపన్ దాస్ గుప్తా కోరారు. బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చర్యలు.. నాజీ పాలనకు అద్దం పడుతున్నాయన్నారు. బంగాల్లో ప్రతిపక్షాలపై అణచివేత ధోరణి సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.