75వ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి శతాబ్ది ఉత్సవాల మధ్య ఉన్న 25 ఏళ్ల కాలాన్ని అమృత ఘడియలుగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ 25 ఏళ్లను సద్వినియోగం చేసుకుని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు మోదీ.
యువతకు ఉద్యోగ కల్పన..
ప్రధానమంత్రి గతిశక్తి పథకంతో యువతకు ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తాయని ప్రధాని మోదీ నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో సమగ్ర మౌలిక వసతలు అభివృద్ధి కోసం 100 లక్షల కోట్లతో గతిశక్తి పథకాన్ని ప్రకటించారు.
త్వరలోనే గతి శక్తి ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు మోదీ.
దేశం నలుమూలలా...
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకల్లో భాగంగా.. 75 వందే భారత్ రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 75 వారాలపాటు తిరగనున్నాయని మోదీ అన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ ఈ రైళ్లు ప్రయాణించే ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాల రాజధానుల మధ్య రైలు మార్గాలకు త్వరలోనే ప్రణాళిక చేయనున్నట్లు మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం సిక్కింలో మినహా అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో రైలు మార్గాలున్నాయి. అయితే.. 2024 కల్లా ఈ రాష్ట్రాలను రైలు మర్గాల ద్వారా అనుసంధానం చేయనున్నట్లు మోదీ తెలిపారు.
ఉడాన్ పథకం ద్వారా దేశంలోని సుదూర ప్రాంతాలను కలిపినట్లు అయిందని మోదీ అన్నారు. ఈ పథకంలో భాగంగానే కొత్త విమానాశ్రయాల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పేర్కొన్నారు.