తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్ అంటే ప్రధానికి భయం.. అందుకే విమర్శలు' - కాంగ్రెస్​పై మోదీ ప్రసంగం

PM Afraid of Congress: దేశంలో నిజాలను ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని చూస్తే ప్రధాని నరేంద్ర మోదీకి భయం పట్టుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని ప్రసంగమంతా కాంగ్రెస్ పార్టీ గురించే ఉంది తప్పా.. భాజపా వాగ్దానాల గురించి లేదని అన్నారు.

PM afraid of Congress
రాహుల్

By

Published : Feb 9, 2022, 8:22 AM IST

PM Afraid of Congress: కాంగ్రెస్ పార్టీ అంటే ప్రధాని నరేంద్ర మోదీకి భయమేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిజాలు చెబుతున్నందుకే.. పార్లమెంట్ ఉభయ సభల్లో మాటలదాడి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని, మాజీ ప్రధాని నెహ్రూని విమర్శించడం మానుకోవాలని హితువు పలికారు.

"ప్రధాని ప్రసంగం అంతా కాంగ్రెస్ గురించే ఉంది. కాంగ్రెస్ ఏం చేయలేదు?, నెహ్రూ ఏం చేయలేదు? అని మాట్లాడారు. కానీ భాజపా ఇచ్చిన వాగ్దానాల మాటే ఎత్తలేదు. మా తాత మంచివాడనే గుర్తింపు ఇంకెవరో ఇవ్వాల్సిన పనిలేదు. ఆయన గురించి ఎవరు ఏం చెప్పినా.. నాకు పట్టింపు లేదు. దేశంలో ఏం జరుగుతోందో ప్రజలు అర్థం చేసుకోవడమే కావాలి."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ప్రధాని ఏమన్నారంటే..?

Modi Speech in Parlament: బడ్జెట్‌ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. 'కుటుంబ పార్టీల నుంచి భారత ప్రజాస్వామ్యం పెద్ద ముప్పును ఎదుర్కొంటోంది. దేశ అభివృద్ధికి కాంగ్రెస్ ఆటంకాలు సృష్టిస్తోంది. తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి కనీస అవసరాలు పొందేందుకు సామాన్య ప్రజలు ఏళ్లపాటు ఎదురుచూడాల్సి వచ్చిందని.. దీనంతటకీ కాంగ్రెస్ కారణం. కాంగ్రెస్​ లేకపోతే దేశం అత్యవసర పరిస్థితిని, సిక్కుల ఊచకోత, కశ్మీర్​ లోయ నుంచి పండిట్ల వలసలను చూసేది కాదు. మహాత్మా గాంధీ భావించినట్లే.. స్వాతంత్ర్యం లభించిన తర్వాత కాంగ్రెస్​ను రద్దు చేసి ఉంటే దేశంలో కుటుంబ రాజకీయాలు ఉండేవి కాదు. ప్రపంచవేదికల్లో నెహ్రూ గ్లోబల్ ఇమేజ్​ కాపాడుకోవడానికి.. గోవా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సత్యాగ్రహుల కోసం ఆర్మీని పంపించలేదు.' అని అన్నారు.

పాక్​-చైనా మైత్రిపై మాటల యుద్ధం..

Congres vs BJP: పాక్ చైనా మైత్రిపై పార్లమెంట్​లో మాటల యుద్ధమే నడిచింది. పాక్ -చైనాల మైత్రి భారత్​కు చేటు చేస్తుందని రాహుల్​ ఫిబ్రవరి 2న పార్లమెంట్​లో మాట్లాడారు. ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలని హితువు పలికారు. దీనిపై స్పందించిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమాధానమిస్తూ.. అవి 1960వ దశకం నుంచే అలా ఉన్నాయని చెప్పారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ.. భాజపా అధికారంలోకి వచ్చి కూడా ఏం చేయలేదని ఒప్పుకుంటున్నారని ఆరోపించారు. చైనా ఇప్పటికే భారత భూభాగాల్లోకి చొచ్చుకువచ్చిందని అన్నారు.

ఇదీ చదవండి:'కుటుంబ పార్టీలతో భారత ప్రజాస్వామ్యానికి ముప్పు'

ABOUT THE AUTHOR

...view details