'భారత్- ఆస్ట్రేలియా సర్క్యూలర్ ఎకానమీ హాకథాన్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ హాకథాన్తో ఇరు దేశాలు ప్రతిపాదించే సృజనాత్మక పరిష్కారాలు.. సమస్యలను అధిగమించేందుకు దోహదపడతాయన్నారు.
సమస్యల నుంచి గట్టెక్కేందుకు సర్క్యూలర్ ఎకానమీ విధానం కీలకమని అభిప్రాయపడ్డారు మోదీ. రీసైక్లింగ్, వ్యర్థాలను తొలగించడం... దీని ద్వారా సామర్థ్యాన్ని పెంచుకోవటం మన జీవనశైలిలో భాగం కావాలన్నారు.
భారత్- ఆస్ట్రేలియా బలమైన బంధం.. కరోనా తర్వాత ప్రపంచంలో ఏర్పడ్డ పరిస్థితులను మార్చటంలో ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు ప్రధాని. ప్రకృతి మనకు అందించే వనరులకు మనం అధినేతలం కాదన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. అవి భావి తరాలకు అందించేందుకు కృషి చేయాలన్నారు.
"ఈ హాకథాన్ భారత్, ఆస్ట్రేలియా విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీస్తుంది. విద్యార్థుల ఆలోచనలు సర్క్యూలర్ ఎకానమీ సమస్యలను పరిష్కరించటంలో కీలక పాత్ర పోషిస్తాయి. విద్యార్థుల శక్తి.. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించటం, కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టడంలోనే ఉంది. విద్యార్థుల శక్తి, సృజనాత్మకతపై నాకు నమ్మకం ఉంది."