అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది కేంద్ర ఆరోగ్య శాఖ (Ministry of Health India). ఈ మూడు నెలల కాలంలో పండుగలు, పెళ్లిళ్లు అధికంగా ఉండటం వల్ల కరోనా (Covid-19 News) మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని చెప్పింది. కాబట్టి, ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో తిరగకుండా.. వేడుకల్లో వర్చువల్‌గా పాల్గొనాలని సూచించింది.
మహమ్మారి రెండో దశ (Covid-19 India) ఇంకా ముగియలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రోజువారీ కేసుల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, ఇప్పటికీ ప్రతిరోజు 20వేల కొత్త కేసులు నమోదవుతున్నాయని చెప్పింది.
"ప్రస్తుతం పరిస్థితులు కాస్త కుదుటపడినా, ఇదే కొనసాగుతుందని అనుకోకూడదు. మనం జాగ్రత్తగా ఉండకపోతే మహమ్మారి తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. అనవసర ప్రయాణాలు చేయకుండా, షాపింగ్ కోసం ఆన్‌లైన్‌ను ఆశ్రయించడం మేలు."
- లవ్ అగర్వాల్, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి
గతవారం దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో (Covid-19 Cases in India) 50శాతం కేరళలోనే వెలుగుచూశాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో లక్షకుపైగా యాక్టివ్ కేసులున్నాయి.
మిజోరం, కేరళ, సిక్కిం, మణిపుర్, మేఘాలయాలో వీక్లీ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 34 జిల్లాల్లో.. వీక్లీ పాజిటివిటీ రేటు (Weekly Positivity Rate India) 10శాతానికి పైగా ఉందని వెల్లడించింది.