ఎవరైనా తమకు ఇష్టమైన వారి ప్రత్యేక రోజులను జరుపుకోవాలనుకుంటే పెద్ద ఫంక్షన్ హాల్లో లేదా ప్రత్యేక ప్రదేశాలలో తమ సన్నిహితుల మధ్య చాలా ఘనంగా గుర్తుండిపోయేలా వేడుకలను జరుపుకోవాలనుకుంటారు. కానీ ఒక తండ్రి తన కూతురి మీద ప్రేమతో ఏకంగా అసెంబ్లీలోనే పుట్టిన రోజు వేడుకలను జరపాలని అద్దెకు అడిగిన సంఘటన కర్ణాటకలో జరిగింది.
బెళగావి జిల్లా గోకాక్ తాలూకా ఘటప్రభ నివాసి లాయర్ మల్లికార్జున చౌకశీ.. తన కూతురు పుట్టిన రోజును జరుపుకోవడానికి సువర్ణసౌధను అద్దెకు ఇవ్వాలని స్పీకర్‌కు, జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. తన ఒక్కగానొక్క కూతురు మణిశ్రీ ఐదో పుట్టినరోజును గుర్తుండి పోయే విధంగా జరపాలనుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
"నా ఒక్కగానొక్క కూతురు మణిశ్రీకి జనవరి 30న 5వ సంవత్సరం పూర్తవుతుంది. ఆమె 1వ తరగతిలో ప్రవేశం పొందబోతుంది. ఇది ఆమె జీవితంలో అమూల్యమైన క్షణం. అందుకే ఆమె పుట్టినరోజు జరుపుకునేందుకు కర్ణాటక సువర్ణసౌధను నాకు ఒక రోజు అద్దెకు ఇవ్వమని కలెక్టర్‌కు, స్పీకర్‌కు అభ్యర్థించాను"