కొవిడ్ బాధితులకు విచక్షణారహితంగా ప్లాస్మా చికిత్సను అందించడం మంచిది కాదని భారతీయ వైద్యపరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్పష్టం చేసింది. కొవిడ్-19 వ్యాధి తీవ్రతను తగ్గించడంలో లేదా మరణాలపై ప్లాస్మా విధానం ప్రభావం చూపడం లేదని ఐసీఎంఆర్ వెల్లడించింది. చికిత్స తీసుకున్నవారితో పాటు తీసుకోనివారిలో ఏ తేడా కనిపించడం లేదని పేర్కొంది. కన్వాలసెంట్ ఫ్లాస్మాథెరపి ప్రభావాన్ని పరిశీలించేందుకు అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 39 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో ఐసీఎంఆర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కొవిడ్ సోకిన 464 మంది బాధితులు పాల్గొన్నారు. వారిలో 235 మందికి ప్లాస్మా చికిత్సను, 229 మందికి సాధారణ చికిత్స అందించగా బాధితులకు ప్లాస్మా విధానం వల్ల ప్రయోజనం కలగలేదని స్పష్టమైనట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
కరోనా రోగులపై పని చేయని ప్లాస్మా చికిత్స..!
కరోనా బారినపడిన వారికి అందించే ప్లాస్మా చికిత్సపై భారతీయ వైద్యపరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది. బాధితులకు ఎక్కువమొత్తంలో ప్లాస్మాతో చికిత్స అందించడం వల్ల వ్యాధి తీవ్రతలో పెద్ద మార్పులు ఏమీ కనిపించడం లేదని స్పష్టం చేసింది. మహమ్మారి మరణాలపై కూడా ప్రభావం చూపలేదని పేర్కొంది.
కరోనా తీవ్రత ప్రాథమిక స్థాయిలో ఉన్న వారికి తొలి మూడు నుంచి ఏడు రోజుల్లోనే యాంటీబాడీలు అధికంగా ఉన్న ప్లాస్మాను ఎక్కించాలని 10 రోజుల తర్వాత ప్లాస్మాథెరపీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉన్నట్లు గుర్తించలేదని ఐసీఎంఆర్ తెలిపింది. కన్వాలసెంట్ ప్లాస్మాలో కేంద్రీకృతమైన ప్రత్యేక ప్రతిరక్షకాల ఆధారంగా ఆరోగ్య పరిస్థితుల మెరుగుదల, రోగ తీవ్రత, ఆసుపత్రిలో ఉండాల్సిన రోజుల తగ్గుదల, మరణాల నియంత్రణ లాంటి ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బాధితులకు ప్లాస్మా చికిత్సను అందించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించింది.