- దేశంలోని భాజపా వ్యతిరేక శక్తుల ఏకీకరణ
- సార్వత్రిక ఎన్నికల లోపు ఇతర రాష్ట్రాల్లో టీఎంసీ విస్తరణ
ఈ రెండు వ్యూహాలతో జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని తృణమూల్ కాంగ్రెస్(All India Trinamool Congress) అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) భావిస్తున్నారు.
జాతీయ రాజకీయాల్లో మమతను తిరుగులేని నేతగా నిలబెట్టేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కలిసి టీఎంసీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇటీవల జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హిట్ కొట్టిన పీకే-ఐప్యాక్, టీఎంసీ జోడీ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను దెబ్బతీసేందుకు వ్యూహ రచన చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బంగాల్లో 42 స్థానాలకు గానూ 18 సీట్లను గెలుచుకుని టీఎంసీకి భాజపా గట్టి పోటీ ఇచ్చింది. అయితే 2021లో ఆ హవాను కమలదళం కొనసాగించలేకపోయింది. కారణం.. ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు, మమత ప్రజాకర్షణ శక్తి. ముందు చెప్పినట్లుగానే భాజపాను రెండంకెలకు పరిమితం చేసి.. సత్తా చాటింది ఈ ద్వయం. ప్రధాని మోదీ- అమిత్ షా ద్వయానికి ఎదురొడ్డి.. 200కు పైగా సీట్లను గెలుచుకొని మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.
మమతా బెనర్జీ ప్రజాకర్షణ శక్తి, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సమన్వయం, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో పాటు ఆయనకు చెందిన ఐప్యాక్ సంస్థ వల్లే టీఎంసీకి ఈ విజయం సాధ్యమైంది.
ఈ ఎన్నికల్లో ఘన విజయం ద్వారా మోదీకి ఎదురు నిలిచేది తానేననే సంకేతాలను ఇచ్చారు మమత. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్‌తో పాటు ఐప్యాక్‌తో కలిసి సుదీర్ఘ కాలం పని చేయాలని మమత భావించినట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఇది నిజమైతే.. కేంద్ర రాజకీయాల్లో మమత సత్తా చాటేందుకు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు.. ఉపయోగపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
క్రియాశీలక రాజకీయల్లోకి పీకే?
బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఇకపై తాను ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోనని పీకే ప్రకటించారు. క్రియాశీల రాజకీయల్లో ప్రవేశించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఎంసీ-ఐప్యాక్ పరస్పర అంగీకారంతోనే పీకే ఈ ప్రకటన చేసి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ విషయంలో టీఎంసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. పార్టీ నాయకులు మాత్రం టీఎంసీ-ఐప్యాక్ మరో ఐదేళ్లు కలిసి పనిచేస్తాయని చెబుతున్నారు.
వ్యూహాలు ఇవే..
'తృణమూల్ కాంగ్రెస్‌ను జాతీయ పార్టీగా మలిచేందుకు చేసే ప్రయత్నాలు ఈసారి భిన్నంగా ఉంటాయి. కేవలం ఒకటి, రెండు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడానికో, ఓట్ల వాటా పెంచుకోవడానికో పరిమితం కాబోము. భాజపాపై యుద్ధం చేసి, ఎన్నికల్లో గెలవడమే మా లక్ష్యం' అంటూ మమత బెనర్జీ అంతరంగాన్ని ఇటీవల ఆవిష్కరించారు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ.
అయితే అది సాధ్యం కావాలంటే.. రెండు వ్యూహాలను అనుసరించాలని టీఎంసీ నిర్ణయించింది.