దేశ రాజకీయాల్లో కేరళది ప్రత్యేక స్థానం. ఇక్కడ ఎంత భారీ స్థాయిలో అభివృద్ధి జరిగినా.. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో అధికార మార్పిడికే ఓటు వేస్తారు కేరళవాసులు. ఎన్నోమార్లు ఈ విషయం రుజువైంది కూడా. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరుగు లేని విజయాన్ని అందుకుని.. తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుని చరిత్ర సృష్టించారు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఎన్నో సవాళ్లు.. మరెన్నో ఆరోపణలను ఎదుర్కొని.. ముందుకు సాగి విజయ తీరాలకు చేరిన విజయన్.. గురువారం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
పినరయి విజయన్ అనే నేను..
ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రజా పరీక్షలో విజయం సాధించిన పినరయి విజయన్.. కేరళ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగరేసి రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించి.. వరుసగా రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. మరో దఫా తనదైన మార్క్ పాలనను అందించేందుకు సిద్ధమయ్యారు.
విజయన్ పూర్తి పేరు పినరయి విజయన్. ఆయన పుట్టింది.. 1945 మే 24న నాటి మద్రాసు ప్రావిన్సులోని మలబార్ జిల్లాలో. విజయన్ తల్లిదండ్రులు కోరన్, కల్యాణి. గవర్నమెంట్ బ్రెన్నెన్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ పూర్తి చేసిన ఆయనకు ఇద్దరు సంతానం. భార్య కమల.. విజయన్ వెన్నంటే ఉంటారు.బ్రెన్నెన్ కళాశాల నుంచే విజయన్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. నాటి విద్యార్థి సంఘాల్లో ఆయన చురుకుగా ఉండేవారు. అనంతరం సీపీఎంలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం విజయన్‌కు కూడా ఎంతో ప్రత్యేకం! అటు నిపా.. ఇటు కరోనా.. ఓవైపు గోల్డ్ స్కాం, మరోవైపు శబరిమల... ఇలా ఎన్నో సవాళ్లను విజయన్ ఎదుర్కొన్నారు. వాటన్నింటికి ఎదురీది.. ప్రజల నుంచి క్లీన్ చిట్ పొందారు. ప్రజా పరీక్షలో విజయం సాధించి మళ్లీ సీఎం కుర్చీని అధిరోహించారు.