కొవిడ్ టీకా(covid vaccine) పంపిణీ ప్రక్రియను(vaccination) నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. పిటిషన్‌దారుకు రూ.50,000 జరిమానా విధించింది. కరోనా కట్టడికి వినియోగిస్తున్న టీకాలపై(covid vaccine) పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండానే వినియోగించటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఓ ఆర్మీ మాజీ అధికారి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ఏఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యాజ్యం ప్రజా ప్రయోజనాలకు సంబంధించినది కాదని పేర్కొంది.
దేశంలో జనవరిలోనే టీకా పంపిణీ ప్రక్రియ(vaccination) ప్రారంభమైనందున.. ఇప్పుడు వ్యాక్సిన్ రద్దు చేయాలని కోరడం అసందర్భమని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం లక్షలాది మంది.. టీకా తీసుకునేందుకు ఎదురు చూస్తున్నారని పేర్కొంటూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగాను పిటిషన్ దారుకు రూ.50,000 జరిమానా విధించింది.
అంతకుముందు.. 'కేంద్ర ప్రభుత్వం రెండు వ్యాక్సిన్లకు అనుమతించింది కానీ, వాటికి సంబంధించిన రికార్డులేవీ లేవు' అని పిటిషన్‌దారు తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. 2019 ఔషధ నిబంధనలకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరించిందని తెలిపారు. టీకా పంపిణీని నిలిపివేయాలని, లేదంటే.. సమాజానికి పెద్దహాని తలెత్తే ప్రమాదం ఉందని చెప్పారు.