Pil On 2000 Notes : ఎటువంటి గుర్తింపు కార్డు, అభ్యర్థన పత్రం లేకుండా 2వేల రూపాయల నోట్ల మార్పిడిని అనుమతించాలన్న ఆర్బీఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్బీఐ నిర్ణయాన్ని సమర్థిస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది. ఇది కార్యనిర్వాహక విధానమైన నిర్ణయమని సీజేఐ జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ PS నరసింహలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
కొన్నాళ్ల క్రితం రూ.2 వేల నోట్ల మార్పిడిపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది సుప్రీం కోర్టు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశాన్ని కల్పించడాన్ని సవాల్ చేస్తూ సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందాల్తో కూడిన ధర్మాసనం.. ఈ కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని శుక్రవారం చెప్పింది. వేసవి సెలవుల అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం వాదనలు వింటుందని స్పష్టం చేసింది. ముఖ్యమైన అంశాన్ని విచారణకు స్వీకరించకపోవడం దురదృష్టకరమని అశ్విని కుమార్ ఉపాధ్యాయ చెప్పారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ఇది కోర్టని.. బహిరంగ వేదిక కాదంటూ.. ఇంతటితో వాదనలు ముగించాలని తేల్చి చెప్పింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.