శబరిమల నుంచి ఓ పావురం 800 కిలోమీటర్లు ప్రయాణించి తన యజమాని ఇంటికి చేరుకుంది. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. చిత్రదుర్గ జిల్లాలోని మొలకల్మూరు తాలుక, మేగలహట్టి గ్రామానికి చెందిన వెంకటేశ్.. ఇంట్లో అనేక పావురాలను పెంచుకుంటున్నాడు. అయ్యప్ప స్వామి మాల ధరించిన అతడు.. దర్శనానికి శబరిమలకు వెళ్లాడు. తనతో పాటు పెట్టెలో ఓ పావురాన్ని తీసుకెళ్లాడు. అక్కడే.. పావురాన్ని గాల్లోకి విడిచిపెట్టాడు. పక్షి జ్ఞాపకశక్తి సామర్థ్యం ఏమేరకు ఉంటుందని తెలుసుకునేందుకు పావురాన్ని వదిలిపెట్టినట్లు వెంకటేశ్ తెలిపాడు.
అయ్యప్పను దర్శించుకుని ఇంటికి తిరిగొచ్చిన పావురం.. 800కి.మీ దూరాన్ని గుర్తుపెట్టుకొని..
శబరిమల నుంచి ఓ పావురం యజమాని ఇంటికి సురక్షితంగా చేరుకుంది. నాలుగు రోజుల్లోనే సుమారు 8 వందల కిలోమీటర్లు ప్రయాణించింది.
డిసెంబర్ 30న పక్షిని వదిలిపెట్టగా.. నాలుగు రోజుల్లోనే అది ఇంటికి చేరుకుంది. చిత్రదుర్గ జిల్లాకు శబరిమలకు మధ్య 800 కిలోమీటర్లకు పైగా దూరం ఉంది. అయినప్పటికీ.. పావురం దారిని పక్కాగా గుర్తుపెట్టుకొని తన యజమాని ఇంటికి తిరిగి వచ్చేసింది. పూర్తిగా శిక్షణ పొందిన పావురాలే ఇలా గుర్తుపెట్టుకొని వెనక్కి వస్తుంటాయని వెంకటేశ్ చెబుతున్నాడు. శబరిమల నుంచి పావురం తిరిగొచ్చిందని తెలియగానే.. గ్రామస్థులు దాన్ని చూసేందుకు వెంకటేశ్ ఇంటికి వస్తున్నారు. పావురం అయ్యప్ప దర్శనం చేసుకుందని, దేవుడి ఆశిస్సులతోనే క్షేమంగా ఇంటికి వచ్చిందని గ్రామస్థులు అంటున్నారు.