Bin laden photo in office: యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసి.. అమెరికా చేతిలో హతమైన వరల్డ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను ‘ప్రపంచపు ఉత్తమ ఇంజినీర్’ అంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి కొనియాడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగు చూసింది. అంతేకాకుండా ఉగ్రవాది ఫొటోను తన కార్యాలయంలో పెట్టుకోవడం గమనార్హం. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. చివరకు ఆ ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని దక్షిణాంచల్ విద్యుత్ విత్రాన్ నిగమ్ లిమిటెడ్ (DVVNL)లో సబ్-డివిజినల్ ఆఫీసర్ (SDO)గా రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, అంతర్జాతీయ ఉగ్రవాది అయిన ఒసామా బిన్ లాడెన్ ఫొటోను తన కార్యాలయంలో పెట్టుకోవడమే కాకుండా ‘గౌరవనీయులైన ఒసామా బిన్ లాడెన్, ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్ ఇంజినీర్’ అంటూ ఉగ్రవాదిని కీర్తిస్తూ రాసుకున్నాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతోపాటు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. రవీంద్ర ప్రకాశ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యాలయంలోని లాడెన్ ఫొటోను తొలగించి.. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరుపనున్నట్లు ఫరూఖాబాద్ కలెక్టర్ సంజయ్ కుమార్ సింగ్ వెల్లడించారు.