Phytochemicals in plants: హిమాలయాల్లో ఎన్నో అద్భుతాలు దాగున్నాయని, చాలా రోగాలను నయం చేసే ఆయుర్వేద మూలికలు దొరుకుతాయని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు ఆ మాట నిజమని నిరూపించారు కొందరు శాస్త్రవేత్తలు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్-19 వైరస్‌ను నిరోధించే ఫైటోకెమికల్స్ కలిగిన మొక్కను గుర్తించారు.
హిమాచల్‌ప్రదేశ్, మండిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ (ఐసీజీఈబీ) పరిశోధకులు.. కొవిడ్-19 చికిత్సలో కీలకమైన ఫైటోకెమికల్స్ను హిమాలయాల్లోని 'రోడోడెండ్రాన్ అర్బోరియం' అనే మొక్క పూరేకుల్లో గుర్తించారు. ఈ మొక్కను స్థానికంగా 'బురాన్ష్'గా పిలుస్తారు. ఈ ఫైటోకెమికల్స్ వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి.
ఈ అధ్యయనం ఇటీవలే 'బయోమాలిక్యులార్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్' జర్నల్‌లో ప్రచురితమైంది.
" వైరస్‌పై శరీరానికి పోరాడే శక్తిని ఇచ్చే పద్ధతుల్లో వ్యాక్సిన్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా టీకాయేతర ఔషధాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా ఔషధాల్లో రసాయనాలు ఉంటాయి. ఇవి మన శరీర కణాలలోని గ్రహకాలను బంధిస్తాయి, వైరస్ ప్రవేశించకుండా నిరోధిస్తాయి. అలాగే.. శరీరంలో వైరస్ ప్రవేశించినా వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయి. వివిధ రకాల చికిత్సలపై అధ్యయనం చేశాక.. మొక్కల నుంచి తీసుకున్న రసాయనాలు- ఫైటోకెమికల్స్ వైరస్‌ను నిరోధించటంలో కీలకంగా మారుతున్నాయని తెలిసింది."