రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో కాంగ్రెస్ 'చింతన్ శిబిర్' ప్రారంభమైంది. 430 మంది కాంగ్రెస్ నేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు. దేశంలోని రాజకీయ, ఆర్థిక, సామాజిక, రైతాంగ, ఉపాధి, పార్టీ సంస్థాగత ప్రక్షాళన అంశాలపై వీరంతా చర్చించి తీర్మానాలు చేయనున్నారు. చింతన్ శిబిర్‌లో రూపొందించిన తీర్మానాలకు సీడబ్ల్యుసీ ఆమోదం లభించిన తరువాత సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లనుంది కాంగ్రెస్ పార్టీ.
chintan shivir sonia gandhi speech:నవ సంకల్ప్ చింతన్ శిబిర్‌లో ప్రారంభోపన్యాసం చేశారు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. నేతలంతా తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పాలని సూచించారు. పార్టీ అంతా ఐకమత్యంగానే ఉందన్న సందేశం దేశప్రజలకు ఇవ్వాలని కోరారు. వ్యక్తిగత లక్ష్యాలకన్నా పార్టీకే ఎక్కువ విలువ ఇవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీ ఎంతో చేసిందని, ఇప్పుడు పార్టీకి తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా పాలకపక్షంపై విమర్శలు గుప్పించారు. 2016 నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారి పోయిందని ఆరోపించారు. మోదీ పాలన కొనసాగితే.. భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
'దేశాన్ని మతప్రాతిపదికన విభజించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దేశంలో ఉన్న మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని దాడులు పెంచారు. మైనారిటీలు కూడా దేశంలో ఒక భాగం అన్న విషయాన్ని అందరూ గుర్తెరగాలి. ప్రతిపక్ష నేతలపైకి విచారణ సంస్థలను ఉసిగొల్పి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. గాంధీని చంపిన వారిని హీరోలుగా చిత్రీకరిస్తున్నారు. నెహ్రూ నెలకొల్పిన సంస్థలన్నిటినీ ధ్వంసం చేస్తూ వ్యవస్థలపై ఉన్న జ్ఞాపకాలను తుడిచేస్తున్నారు. లౌకికత్వంపై దాడి చేస్తూ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు. ఆదివాసీలు, దళితులు, మహిళలపై రోజురోజుకీ దాడులు పెరుగుతున్నాయి. దేశాన్ని కార్పొరేట్ పరం చేస్తున్నారు. దేశంలో ప్రజలంతా ప్రశాంతంగా జీవించాలి. అందుకు అనుగుణంగా వాతావరణం పునరుద్ధరణ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది.'