కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను రూపొందించిన ఫైజర్, తాజాగా ఔషధంపై దృష్టి సారించింది. కొవిడ్ చికిత్సలో భాగంగా నోటి ద్వారా తీసుకునే ఔషధాన్ని వచ్చే ఏడాదిలోగా తీసుకువస్తామని వెల్లడించింది. నోటి ద్వారా, ఇంజక్షన్ రూపంలో తీసుకునే రెండు ఔషధాల (యాంటివైరల్)పై ప్రయోగాలు కొనసాగుతున్నాయని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైజర్ యాజమాన్యం పేర్కొంది.
'ప్రస్తుతం రెండు విధాల్లో యాంటివైరల్‌ను తేవడానికి ప్రయత్నిస్తున్నాము. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తొలుత మాత్ర రూపంలో తేవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాము. తద్వారా కొవిడ్ బాధితులు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది' అని ఫైజర్ సంస్థ సీఈఓ ఆల్‌బెర్ట్ బౌర్లా వెల్లడించారు. వ్యాక్సిన్‌ను తేవడానికి ఎంత వేగంతో పనిచేశామో ఔషధానికీ అంతే కృషి చేస్తున్నామని చెప్పారు. నియంత్రణ సంస్థలు కూడా వేగంగా అనుమతిస్తే..ఈ ఏడాది చివరి నాటికే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బౌర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా చికిత్సలో ఉపయోగించే ఈ ఔషధం కొత్తగా వెలుగు చూస్తోన్న పలు వేరియంట్‌లపైనా సమర్థంగా పనిచేస్తుందనే విశ్వాసం ఉందన్నారు. ప్రస్తుతం ఇప్పటివరకు వచ్చిన అధ్యయనాల్లో పురోగతి కనిపించిందని.. వేసవి నాటికి వీటికి సంబంధించి పూర్తి అధ్యయన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆల్‌బెర్ట్ బౌర్లా పేర్కొన్నారు.