తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆపరేషన్​ PFI' ముమ్మరం.. ఏడు రాష్ట్రాల్లో సోదాలు.. 170 మంది అరెస్ట్! - nia on kerala pfi leaders

PFI raids in India : పాపులర్ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా కేసులో కేంద్ర సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. మంగళవారం ఉదయం 7 రాష్ట్రాల్లో ఎన్​ఐఏ, ఈడీ సంయుక్తంగా సోదాలు చేపట్టి.. 170కి పైగా మందిని అదుపులోకి తీసుకున్నాయి.

pfi raids in india
పీఎఫ్​ఐ కార్యాలయాలపై ఎన్​ఐఏ, ఈడీ దాడులు

By

Published : Sep 27, 2022, 8:04 AM IST

Updated : Sep 27, 2022, 7:03 PM IST

PFI raids by NIA : ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా-పీఎఫ్​ఐపై కేంద్ర సంస్థలు మరోమారు గురిపెట్టాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ), ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​(ఈడీ) మంగళవారం సంయుక్త ఆపరేషన్​ చేపట్టి.. 170కి పైగా మందిని అదుపులోకి తీసుకున్నాయి. 7 రాష్ట్రాల్లో PFI సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, దిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అసోంలో ఈ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్​లో కేంద్ర నిఘా సంస్థ-ఐబీ, ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా భాగమైనట్లు ఎన్​ఐఏ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

  • పీఎఫ్ఐ కేసు దర్యాప్తులో భాగంగా దేశ రాజధానిలో 30 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు అధికారులు. నిజాముద్దీన్, రోహిణి, ఈశాన్య దిల్లీలోని అనేక ప్రదేశాల్లో అర్థరాత్రి నుంచి సోదాలు నిర్వహించారు దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు.
  • కర్ణాటకలో 40 మందికిపైగా అదుపులోకి తీసుకున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలో దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. నిందితులపై సీఆర్​పీసీ 107, 151 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.
  • గుజరాత్​లో సుమారు 10 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాపులర్ ఫ్రంట్​ ఆఫ్ ఇండియా సంస్థతో వీరికి ఉన్న సంబంధాలపై ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాద నిరోధక దళం, జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్​ను చేపట్టారు.
  • ఈ కేసుతో సంబంధం ఉన్న 25 మందిని మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్నారు. పుణె నగరంలో ఆరుగురిని అరెస్టు చేశారు.
  • పీఎఫ్​ఐతో సంబంధం ఉన్న కేసులో 25 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు అసోం పోలీసులు. గోపాల్​పురలో 10 మంది, కంరూప్​లో ముగ్గురు, బార్​పేట, బక్సా, దర్రాంగ్​, ఉదల్​గురి, కరీంగంజ్​లో మిగిలిన వారిని అరెస్ట్ చేశారు.

రూ.5కోట్ల పరిహారం కోసం డిమాండ్..
మరోవైపు, ఈ సోదాలను నిరసిస్తూ నిర్వహించిన హర్తాళ్​లో ధ్వంసమైన ఆస్తులకు పీఎఫ్ఐ పరిహారం చెల్లించాలంటూ హైకోర్టును ఆశ్రయించింది కేరళ ఆర్టీసీ. పీఎఫ్ఐ నుంచి రూ.5 కోట్ల పరిహారం ఇప్పించాలని కోరుతూ కోర్టులో వ్యాజ్యం వేసింది.

పీఎఫ్​ఐ లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయడం.. గత రెండు వారాల్లో ఇది మూడోసారి.సెప్టెంబర్ 22న దేశవ్యాప్తంగా ఎన్​ఐఏ విస్తృత సోదాలు నిర్వహించింది. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై 11 రాష్ట్రాల్లోని 106 మంది పీఎఫ్​ఐ కార్యకర్తలను అరెస్టు చేసింది. కేరళలో అత్యధిక అరెస్టులు జరిగాయి. దాదాపు 22 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక (20), తమిళనాడు (10), అసోం (9), ఉత్తరప్రదేశ్ (8), ఆంధ్రప్రదేశ్ (5), మధ్యప్రదేశ్ (4) , పుదుచ్చేరి, దిల్లీ (3) రాజస్థాన్ (2)లోనూ పలువురిని అరెస్టు చేసింది.

అసలు ఎందుకీ ఆపరేషన్?
ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేవారు, ముష్కరుల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవారు, నిషేధిత సంస్థల్లో చేరేలా ప్రజల్ని ప్రభావితం చేసేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్​ చేపట్టామన్నది ఎన్​ఐఏ మాట. ఇటీవల అనేక వివాదాలతో వార్తల్లో నిలిచిన పాపులర్ ఫ్రంట్​ ఆఫ్ ఇండియా-పీఎఫ్​ఐ కార్యాలయలాపైనే జాతీయ దర్యాప్తు సంస్థ ప్రధానంగా గురిపెట్టింది.

అసలేంటీ పీఎఫ్​ఐ?
2006లో కేరళలో ఏర్పాటైంది పీఎఫ్​ఐ. ప్రస్తుతం దిల్లీలో ప్రధాన కార్యాలయం ఉంది. అణగారిన వర్గాల సాధికారతే తమ లక్ష్యమని ఆ సంస్థ చెబుతూ ఉంటుంది. కానీ.. దేశంలోని భద్రతా సంస్థల వాదన మాత్రం భిన్నం. అతివాద ఇస్లాంను పీఎఫ్​ఐ ప్రోత్సహిస్తోందన్నది ప్రభుత్వ వర్గాల ప్రధాన ఆరోపణ.

పీఎఫ్​ఐపై ఇంకేమైనా కేసులు ఉన్నాయా?
అవును. పీఎఫ్​ఐపై ఇంతకముందు కూడా ఇలాంటి దాడులు జరిగాయి. పౌరసత్వ చట్టం వ్యతిరేక ఆందోళనలు, 2020 దిల్లీ అల్లర్లు, యూపీ హాథ్రస్​లో దళిత బాలిక సామూహిక అత్యాచారం వ్యవహారంలో కుట్ర సహా మరికొన్ని సందర్భాల్లో.. పీఎఫ్​ఐ ఆర్థిక వనరులు సమకూర్చిందన్న ఆరోపణలపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. లఖ్​నవూలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో ఇప్పటికే రెండు అభియోగ పత్రాలు కూడా దాఖలు చేసింది.

'భారత్​ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్ర'.. 'PFIని బ్యాన్ చేయండి'

Last Updated : Sep 27, 2022, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details