PFI Ban In India : దేశంలో ఉగ్రదాడులకు సంబంధించి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) పన్నిన పన్నాగాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడాలని పీఎఫ్‌ఐ చూసినట్లు తాజాగా వెల్లడైంది. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం వర్గాలు చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు బయటకొచ్చాయి. నాగ్‌పుర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం కూడా పీఎఫ్‌ఐ టార్గెట్ లిస్ట్‌లో ఉందని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి.
దసరా వేళ మహారాష్ట్రలో ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ సభ్యుల కదలికలపై నిఘా పెట్టాలని పీఎఫ్ఐ ప్రణాళికలు చేసినట్లు సమాచారం. వీరిని టార్గెట్ చేసుకుని దేశంలో.. మత విద్వేషాలను రెచ్చగొట్టాలని కుట్రలు పన్నుతున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. భాజపా, సంఘ్ నేతలతో పాటు పలు ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారులు కూడా వీరి హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాలపై ఈ సంస్థ సభ్యులు రెక్కీలు కూడా నిర్వహించినట్లు ఇదే విషయాన్ని నిఘా వర్గాలు కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా నేతలు, సంస్థలకు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
2047 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఎజెండాతో పనిచేస్తున్న ఆరుగురు వ్యక్తులను యూపీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ శనివారం అరెస్టు చేసింది. వారి నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. ఇలా ఒక్కొక్కటిగా పీఎఫ్‌ఐ సంబంధించిన ఉగ్ర కుట్రలు బయటపడుతుండడం వల్ల.. కేంద్ర దర్యాప్తు బృందాలు అప్రమత్తమయ్యాయి. పీఎఫ్‌ఐ ఉగ్రకార్యకలాపాలను అడ్డుకునేందుకు.. ఆ సంస్థపై నిషేధం విధించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.