Rajasthan Petrol Crisis: రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల ముందు జనం బారులు తీరారు. తమ వాహనాల్లో ఇంధనం నింపుకునేందుకు కిలోమీటర్ మేర క్యూ కట్టారు. వాహనదారులు ఇంత భారీ సంఖ్యలో గుమికూడటం వల్ల పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ పెట్రోల్ బంకుల్లో మంగళవారం మధ్యాహ్నమే స్టాక్ అయిపోవడం వల్ల జైపుర్‌లో పెట్రోల్, డీజిల్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో సాయంత్రం నుంచి నగరంలోని ఐఓసీఎల్ బంకుల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు వాహనదారులు.
హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థలు బంకులకు ఇంధన సరఫరా నిలిపివేయడం వల్ల రాజస్థాన్‌లో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం ఐఓసీఎల్ బంకుల్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంది. రద్దీ దృష్ట్యా బంకు నిర్వాహకులు ఒక్కో వాహనంలో రూ.100 వరకు మాత్రమే పెట్రోల్, డీజిల్ నింపుతున్నారు. గత్యంతరం లేక ప్రజలు పెద్ద పెద్ద క్యూలలో నిలబడి ఎంతో కొంత ఇంధనాన్ని ట్యాంకుల్లో నింపుకుంటున్నారు.