Petrol Bomb Attack On Rajbhavan Tamilnadu :తమిళనాడు.. రాజభవన్‌పై పెట్రోల్ దాడి కలకలం సృష్టించింది. గిండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గవర్నర్ నివాసం మెయిన్ గేట్‌పై వినోద్ అనే వ్యక్తి పెట్రోల్ బాంబ్ (Molotov cocktail- అంటే సీసాలో పెట్రోల్ నింపి గుడ్డతో మండిస్తారు)తో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పదించి నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడిని.. రాజ్‌భవన్‌పై పెట్రోల్ బాంబు విసిరేయడం వెనుక ఉన్న ఉద్దేశం తెలుసుకోడానికి అధికారులు విచారిస్తున్నారు. కాగా, ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని.. నిందితుడు కేవలం ఒక పెట్రోల్ బాంబు మాత్రమే ఉపయోగించాడని పోలీసులు వెల్లడించారు.
" (బుధవారం) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాజ్‌భవన్ వెలుపల బారికేడ్‌ల దగ్గర ఓ గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ బాంబులను విసిరేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది గమనించి.. వెంటనే అతడిని చుట్టుముట్టారు. అనంతరం అతడి చేతిలో ఇతర పెట్రోల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు లేవు. నిందితుడు మద్యం తాగి ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్‌భవన్ వద్ద సరైన బందోబస్త్ ఉంది. నిందితుడిని హిస్టరీ-షీటర్ కె వినోద్‌గా గుర్తించాం. అతడు ఓ నేరస్థుడు.. అతడిపై ఇప్పటికే 6-7 కేసులు ఉన్నాయి. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోంది."
--చెన్నై పోలీసు అదనపు కమిషనర్ ప్రేమ్ ఆనంద్ సిన్హా
అయితే మూడు రోజుల క్రితం జైలు నుంచి బయటకు రావడానికి గవర్నర్ అనుమతి ఇవ్వలేదన్న కోపంతో కక్ష పెంచుకున్న నిందితుడు.. ఈ దాడికి పాల్పడ్డట్టు సమాచారం. ఈ ఘటన తమిళనాడులో శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నమలై.. రాష్ట్రంలో ప్రస్తుత శాంతి భద్రతల పరిస్థితిని ఈ దాడి ప్రతిబింబిస్తుందని విమర్శించారు.