తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దర్యాప్తునకు సహకరిస్తుంటే అరెస్టులు ఎందుకు?' - supreme about arrest leagal

తీవ్రమైన నేరం చేశారనో, సాక్షులను ప్రభావితం చేస్తారని భావించినప్పుడే అరెస్టులు చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టబద్ధమే కాబట్టి అరెస్టు చేస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ముఖ్యమైనదని, ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్పింది.

suprem court
సుప్రీం కోర్టు

By

Published : Aug 21, 2021, 6:32 AM IST

చట్టం ప్రకారం అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేయడం కూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రొటీన్‌ వ్యవహారంగా భావించి అరెస్టులు చేస్తే అది వ్యక్తుల పరపతి, గౌరవానికి చెప్పలేనంత హాని కలిగించినట్టవుతుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ముఖ్యమైనదని, ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని తెలిపింది. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి విచారణకు హాజరుకాకుండా ఎగ్గొట్టలేరని దర్యాప్తు అధికారి భావిస్తే, అలాంటి వారిని అరెస్టు చేయాల్సిన అవసరం లేదని జస్టిస్‌ సంజయ్‌ కౌల్‌, జస్టిస్‌ హృషీకేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.

"తీవ్రమైన నేరం చేశారనో, సాక్షులను ప్రభావితం చేస్తారని భావించినప్పుడే అరెస్టులు చేయాల్సి ఉంటుంది. అరెస్టు చేయడం చట్టబద్ధమే కాబట్టి అరెస్టు చేస్తామంటే కుదరదు. అధికారం కలిగి ఉండడాన్ని, ఆ అధికారాన్ని న్యాయ బద్ధంగా ఉపయోగించడానికి మధ్య తేడాను గమనించాలి. దర్యాప్తునకు సహకరిస్తుంటే అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది?"

-సుప్రీంకోర్టు

ఏయే సందర్భాల్లో అరెస్టులు చేయాలనేదానిపై 1994లోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, కానీ కొన్ని ట్రయల్‌ కోర్టులు కూడా అరెస్టులు చేయాలని పట్టుపడుతున్నాయని ధర్మాసనం తెలిపింది. సిద్దార్థ్‌ అనే వ్యాపారవేత్తపై ఏడేళ్ల క్రితం నమోదైన కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి అలహాబాద్‌ హైకోర్టు తిరస్కరించడం వల్ల నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణకు హాజరయి, అభియోగపత్రం కూడా నమోదయిన తరువాత మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

భారతీయ నేర స్మృతిలోని సెక్షన్‌ 170ను పోలీసులు, కోర్టులు తప్పుగా అన్వయిస్తున్నాయంటూ నిందితుని తరఫు న్యాయవాది చేసిన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ఈ సెక్షన్‌లో 'కస్టడీ' అన్న మాటను 'అరెస్టు'గా అర్థం చేసుకుంటున్నాయంటూ అంగీకరించింది. కస్టడీ అంటే అభియోగపత్రం సమర్పించే సమయంలో దర్యాప్తు అధికారి నిందితుడిని కోర్టులో హాజరుపరచడమేనని వివరించింది. కస్టడీ అంటే జ్యుడీషియల్‌ కస్టడీయో, పోలీసు కస్టడీయో కాదని స్పష్టం చేసింది. అభియోగపత్రం సమర్పించడానికి ముందు నిందితుడిని తప్పకుండా అరెస్టు చేయాల్సి ఉంటుందని ట్రయల్‌ కోర్టులు చెప్పడం కూడా సరికాదని తెలిపింది. నిందితునికి బెయిల్‌ మంజూరు చేసింది.

ఇదీ చూడండి:రాష్ట్ర విభజన తర్వాత రిజర్వేషన్​పై సుప్రీం కీలక తీర్పు

ఇదీ చూడండి:'సుప్రీంకోర్టులో త్వరలోనే భౌతిక విచారణ'

ABOUT THE AUTHOR

...view details