'దేవుడికి ఎదురెళ్లి చనిపోయాడు'.. ఇలాంటి మాటలు, సంఘటనలు సినిమాల్లోనే జరుగుతాయి. ఇటీవల వచ్చిన 'కాంతార' అనే చిత్రంలో కూడా ఇలాంటి సన్నివేశం ఒకటి ఉంది. ఇప్పుడు అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలో ఉడిపి జిల్లాలో జరిగింది. 500 ఏళ్ల ఆలయ విషయంలో కోర్టుకు వెళ్లిన వ్యక్తి ఆశ్చర్యకర రీతిలో మరణించాడు. ఈ ఘటన స్థానికులను భయపెడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
పదుబిద్రి అనే గ్రామంలో పదుహిట్లు 'జరందయ దైవస్థాన' ఉంది. ఇక్కడ ఏడాదికోసారి 'నేమోత్సవ' వేడుకలు నిర్వహిస్తారు. అందులో గ్రామస్థులంతా చేరి పండుగ చేసుకుంటారు. ఈ ఆలయ నిర్వహణను 'జరందయ బంట సేవా సమితి' అనే కమిటీ చూసుకుంటుంది. ఈ కమిటీకి ప్రకాశ్ శెట్టి అనే వ్యక్తి ఛైర్మన్‌గా ఉండేవాడు. కొత్త కమిటీ ఏర్పడగానే ప్రకాశ్ శెట్టి తన పదవిని కోల్పోయాడు. అంతవరకు పదవిలో ఉండి.. ఒక్కసారిగా అధికారం లేకపోయే సరికి తట్టుకోలేకపోయాడు ప్రకాశ్ శెట్టి. దీంతో ఎలాగైనా అధికారం చెలాయించాలని.. ఐదుగురు వ్యక్తులతో మరో కమిటీ ఏర్పాటు చేశాడు. అనంతరం ఆ గుడికి 'ప్రధాన పూజారి(గురికారా)'ని నియమించాడు. 'దైవస్థాన'పై హక్కు తనకే ఉందని అధికారం చలాయించడానికి ప్రయత్నించాడు.
ప్రతి సంవత్సరం నిర్వహించే 'నేమోత్సవం'.. ఈసారి జనవరి 7న నిర్వహించి.. 'కోలం' వేయాలని జరందయ దైవస్థానం కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ప్రకాశ్ శెట్ట, అతడు నియమించిన ఆలయ ప్రధాన పూజారి కోర్టుకు వెళ్లారు. ఆ నేమోత్సవాన్ని ఎలాగైనా ఆపాలని డిసెంబర్ 23న స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఆశ్చర్యకరంగా అందరూ చూస్తుండగానే డిసెంబర్ 24 అకస్మాత్తుగా కిందపడి చనిపోయాడు ఆలయ ప్రధాన పూజారి. కాగా, 'నేమోత్సవ' వేడుకలపై లాయర్ బీ నాగరాజ్ స్టే ఆర్డర్‌ను ఎత్తి వేయించారు. ఇంత జరిగినా చలించని ప్రకాశ్ శెట్టి.. కమిటీకి సంబంధించిన పలువురిపై బెదిరింపులకు తెగబడ్డాడు. ఆఖరికి దరంజయ దైవస్థాన దైవ నర్తకుడు భాస్కర బంగేరాని వేధింపులకు గురిచేశాడు. దేవుడు ఆవహించినప్పుడు తన మాటలను దేవుడు చెప్పినట్లుగా చెప్పాలని బెదిరించాడు ప్రకాశ్ శెట్టి.