Congress On Govt 8th Anniversary: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భాజపా అధికారంలోకి వచ్చి 8 ఏళ్లయిన సందర్భంగా.. ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. అన్ని రంగాల్లో విఫలమైందని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోయిందని ఆరోపించింది. ఈ ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం.. అబద్ధాలు, అసత్య హామీలు, తప్పుడు ప్రకటనలు, నకిలీ నినాదాలతో ప్రజలను మోసం చేస్తూనే ఉందన్నారు కాంగ్రెస్ నేతలు రణ్‌దీప్ సుర్జేవాలా, అజయ్ మాకెన్. దిల్లీలో గురువారం కాంగ్రెస్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం చేసిన 'అచ్చే దిన్' నినాదం.. భాజపాకు, కొంతమంది కోటీశ్వరులైన పారిశ్రామికవేత్తలకే పరిమితమైందని ఆరోపించారు.
ఈ సందర్భంగా.. 8 సంవత్సరాలలో భాజపా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ హిందీలో ఓ బుక్‌లెట్‌ను విడుదల చేసింది కాంగ్రెస్. '8 సాల్, 8 ఛాల్, భాజపా సర్కార్ విఫల్' (8 ఏళ్లు, 8 మోసాలు, భాజపా ప్రభుత్వం విఫలం) అనే పేరుతో మోదీ సర్కార్ వైఫల్యాలను హైలైట్ చేసింది. చైనా తరచూ మన సరిహద్దుల్లోకి చొరబడుతోందని, 8 సంవత్సరాల భాజపా పాలనలో మన దేశ సార్వభౌమాధికారం, భద్రతకు నిరంతర ముప్పు ఏర్పడిందని అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. అయినా మోదీ మాత్రం మౌనం వీడట్లేదని ఆరోపించారు.
''8 ఏళ్ల భాజపా పాలనలో దేశం నాశనమైంది. మోదీ స్నేహితులు మాత్రమే ధనవంతులయ్యారు. ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. మోదీ పాలనలో ధరల పెరుగుదల, నిరుద్యోగం పెరగడం, రైతులపై దాడులు, రూపాయి విలువ పతనం, భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడం ఇలా అన్ని రంగాల్లో దేశం నాశనమైంది. మోదీ అచ్చేదిన్ అనేది ఫ్లాప్ సినిమా. 84 శాతం భారతీయుల ఆదాయం పడిపోయింది. 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. కానీ. ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల సంపద మాత్రం భారీగా పెరిగింది. కొవిడ్ సమయంలోనూ.. రోజుకు రూ. వెయ్యి కోట్లకుపైగా ఆర్జించారు.''