Fire in police station: పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టిన వందల మంది గ్రామస్థులు నిప్పు పెట్టి.. పోలీసులపై తుపాకులు పేల్చటం వల్ల ఓ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ సంఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెతియా నగరంలో జరిగింది. ఓ యువకుడిని తీవ్రంగా కొట్టటం వల్లే చనిపోయాడనే ఆరోపణలతో స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.
ఇదీ జరిగింది..
హోలీ రోజున బాల్‌థార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజ్రానగర్ గ్రామంలో డీజే ఏర్పాటు చేసుకున్నారు గ్రామస్థులు. సమాచారం అందుకున్న పోలీసులు డీజే పెట్టటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన అనిరుద్ధ యాదవ్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే.. ఆ యువకుడు బాల్‌థార్ స్టేషన్ ఆవరణలోనే చనిపోయాడు. ఈ సమాచారం అందుకున్న గ్రామస్థులు వందల మంది స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. స్టేషన్‌ను చుట్టుముట్టి వాహనాలకు నిప్పు పెట్టారు. కొందరు తుపాకులు పేల్చటం వల్ల పురుషోత్తమ్పుర్ స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌కు తూటా తగిలి ప్రాణాలు కోల్పోయారు.
అనంతరం.. మృతదేహాన్ని పోలీసు జీపుపై ఉంచి ధర్నాకు దిగారు. యువకుడిని పోలీసులు తీవ్రంగా కొట్టటం వల్లే ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. బెతియా-బాల్‌థార్ రహదారని దిగ్భందించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.