Covid New Variant XE: కొవిడ్ మహమ్మారి ప్రభావం ఇంకా ముగియలేదని.. ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు తప్పక పాటించాలని కేంద్రం తెలిపింది. మరోవైపు మన దేశంలోనూ కొత్తగా బయటపడిన ఎక్స్‌ఈ వేరియంట్‌పై ఆందోళన నెలకొన్న తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైరస్ వ్యాప్తి, ప్రాబల్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణతోపాటు కేసులపై నిఘా పెంచాలని అధికారులకు సూచించారు. కొవిడ్ చికిత్సకు అవసరమైన ఔషధాల లభ్యతపై సమీక్షలు జరుపుతూ, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎక్స్‌ఈ వేరియంట్‌ను తేలిగ్గా తీసుకోవద్దని, తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు.
"12 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు ప్రారంభించే విషయంలో నిపుణులతో చర్చిస్తున్నాం. ఆ వయస్సు పిల్లలకు కొన్ని దేశాలు మాత్రమే వ్యాక్సిన్లు వేస్తున్నారు. భవిష్యత్తులో ఎక్కువ మంది వ్యాక్సిన్ తయారీదారులు మార్కెట్లోకి వస్తే టీకా ధర మరింత తగ్గే అవకాశం ఉంది. 60 ఏళ్ల పైబడిన వారికి ప్రభుత్వ కేంద్రాల్లో టీకా ఉచితంగా అందిస్తాం. మిగతా వారు మాత్రం ప్రైవేటు ఆసుపత్రుల్లో వేయించుకోవాలి. ప్రస్తుతం దేశంలో వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నప్పటికీ.. మహమ్మారి పూర్తిగా అంతమవ్వనందున జాగ్రత్తలు తీసుకోవాలి. దేశంలో టీకాకు అర్హతగల ప్రజల్లో 97 శాతం మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చాం. 85 శాతం మందికి రెండు డోసుల టీకాను అందించాం. ఇక, ఒమిక్రాన్ బారిన పడిన వారిలో వైరస్ తీవ్రతను అరికట్టడంలో టీకాలు కీలక పాత్ర పోషించాయి" అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు.