మతప్రబోధకుడిపై వ్యాఖ్యలు చేసిన నేతలను భాజపా నుంచి సస్పెండ్ చేసినా వివాదానికి ముగింపు పడటం లేదు. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలతో ఇస్లాం దేశాల నుంచి వ్యతిరేకత రాగా దేశంలోనూ ఆగ్రహజ్వాలలు ఎగిసి పడుతున్నాయి. రాళ్ల దాడులు, బాష్ప వాయువు ప్రయోగాలతో ఆయా ప్రాంతాలు రణరంగంగా మారాయి. దిల్లీ జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జామా మసీదు వద్ద జరిగిన ఆందోళనలతో తమకు సంబంధం లేదని మసీదు కమిటీ తెలిపింది. ఆందోళనలకు తాము ఎలాంటి పిలుపు ఇవ్వలేదని స్పష్టం చేసింది.
హింసాత్మకం.. ఝార్ఖండ్‌లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాంచీలోని హనుమాన్ ఆలయం వద్ద నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రెచ్చిపోయిన ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు. రాంచీలో ఘర్షణలు తలెత్తిన ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. జమ్ముకశ్మీర్‌లోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. కశ్మీర్‌లోని కిష్త్వార్ ప్రాంతంలో అధికారులు కర్ఫ్యూ విధించారు. శ్రీనగర్, కిష్త్వార్, భదేర్‌వా ప్రాంతాల్లో అంతర్జాల సేవలు నిలిపివేశారు. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి భద్రతా బలగాలపైకి రాళ్లు రువ్వారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో.. ఉత్తర్‌ప్రదేశ్‌లో పలుచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. లఖ్‌నవూ, మొరాదాబాద్, ప్రయాగ్‌రాజ్, సహ్‌రాన్‌పుర్ ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనకారులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించి లాఠీఛార్జ్ చేశారు. ఈ ఆందోళనల్లో ఒక పోలీస్ గాయపడినట్లు అధికారులు తెలిపారు. అదనపు పోలీసు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆందోళనకారులను గుర్తిస్తున్నామని సహ్‌రాన్‌పూర్ జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.