బిహార్ ప్రజలు.. తాము మద్యం సేవించబోమని (Consumption Of Alcohol) ప్రతిజ్ఞ చేయాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. ఈ కార్యక్రమం ఈ నెల 26న జరగనున్నట్లు తెలిపారు. మద్యపాన నిషేధాన్ని రాష్ట్రంలో కఠినంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులనే కాకుండా ప్రజలను కూడా భాగం చేసేలా ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేశారు.
మద్యపాన నిషేధం పేరుతో వివాహ వేడుకల్లో.. పోలీసులు నిర్వాహకులను వేధిస్తున్నట్లు ప్రతిపక్షమైన ఆర్జేడీ ఆరోపించిన నేపథ్యంలో సీఎం నితీశ్ ఈ మేరకు ప్రకటన చేశారు. పెళ్లిళ్లలో జరిగిన దాడులను సమర్థించిన సీఎం.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. 26న 'మద్యపాన నిషేధ దినం' సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలందరూ మద్యాన్ని సేవించమని, విక్రయించమని ప్రతిజ్ఞ చేయాలని నితీశ్ వెల్లడించారు.