మంచి రోడ్లతో కూడిన మౌలిక సదుపాయాలు కావాలంటే ప్రజలు అందుకు కొంతమొత్తం చెల్లించాల్సిందేనని టోల్ ఛార్జీలనుద్దేశించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) వ్యాఖ్యానించారు. దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వే (Delhi Mumbai expressway) నిర్మాణ పనులను గురువారం సమీక్షించిన ఆయన హరియాణాలోని సోహ్నాలో మీడియా ప్రతినిధులతో (Nitin Gadkari) మాట్లాడారు. టోల్ ఛార్జీల మూలంగా రవాణా వ్యయాలు పెరుగుతున్నాయని ఓ విలేకరి ప్రశ్నించగా.. "మీకు ఎయిర్ కండీషన్‌తో కూడిన హాల్ కావాలంటే ఎంతో కొంత చెల్లించాల్సిందే. లేదనుకుంటే పొలంలో కూడా వివాహ వేడుకలను ఏర్పాటు చేసుకోవచ్చు" అని గడ్కరీ వ్యాఖ్యలు చేశారు.
160 కి.మీ. వేగంతో కారులో..
ఎక్స్‌ప్రెస్ వే గురించి గడ్కరీ (Nitin Gadkari) మాట్లాడుతూ.. ఈ రహదారి అందుబాటులోకి వస్తే దేశంలోని ప్రధాన నగరాలైన దిల్లీ- ముంబయి మధ్య ప్రయాణ సమయం 12 గంటలకు తగ్గుతుందని పేర్కొన్నారు. దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వే పైన 160 కిలోమీటర్ల వేగంతో కారులో ప్రయాణించానని తెలిపారు.