పంజాబ్‌లోని జలంధర్ నగరానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామం ఉప్పల్ భూప. నుర్మహల్ తెహశీల్‌లో ఉండే ఈ గ్రామానికి ఒక విశిష్టత ఉంది. గ్రామంలో ఉండే జనాభా చాలా తక్కువ. ఊరికి చెందిన వారిలో.. అనేక మంది ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం విదేశాల్లో ఉంటారు. వారంతా విదేశాల్లో సంపాదించిన డబ్బుతో.. ఉప్పల్ భూప గ్రామంలో 1970ల నుంచి సొంతిళ్లు నిర్మించుకున్నారు. అందుకే.. పేరుకు గ్రామమైనా చిన్న పట్టణాన్ని తలపించేలా ఇక్కడి నిర్మాణాలు ఉంటాయి.
ఉప్పల్ భూప గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. గ్రామంలో ఇళ్లపై ఉండే నీటి ట్యాంకులు(water tank design for home) భిన్న రూపాల్లో ఉంటాయి. కారు, నౌక, మోటార్ సైకిల్, ట్రాక్టర్ వంటి రూపాల్లో.. నీటి ట్యాంకులు(house water tank design) నిర్మించుకున్నారు. మరికొందరు ట్యాంకులపైనా, ఇంటిపైభాగాన వివిధ రకాల విగ్రహాలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని అనేక ఇళ్లపై ఇలాంటి నిర్మాణాలు, విగ్రహాలు దర్శనం ఇస్తాయి. ఒక ఇంటి యజమాని నీటి ట్యాంకును ఎయిర్ ఇండియా విమానం రూపంలో నిర్మించుకున్నారు. మరొకరు తామరపువ్వు ఆకృతిలో ట్యాంకు నిర్మించి.. ఆ పక్కనే గుర్రం విగ్రహం ఏర్పాటు చేశారు. మరో ఇంటి యజమాని చిన్న పడవ ఆకృతిలో ట్యాంకును నిర్మించారు.
గ్రామంలో ఒకరిని చూసి మరికొరు నీటి ట్యాంకులకు(house water tank design).. మంచి రూపాన్ని ఇచ్చారు. వాస్తు లేదా మరే కారణంతో ఇలా నిర్మించలేదని, కేవలం అందం కోసమే వాటిని ఇంటిపైన ఏర్పాటు చేశారని... గ్రామస్థులు, పక్క గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
" అందం కోసమే ఇవన్నీ నిర్మించారు. చాలా రకాలు ఉన్నాయి. ఇంటి మీద ఉన్న ట్యాంక్‌పై పూలు, ఎద్దులు, సింహం, పహల్వాన్, గుర్రాలు నిర్మించారు. ట్రాక్టర్, మోటార్ సైకిల్ కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ ట్యాంక్‌లపై ఉన్నాయి. వారి అభిరుచులకు తగ్గట్టుగానే ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి."