కరోనా మహమ్మారి విజృంభణతో ఆక్సిజన్ కొరత ఏర్పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ప్రాణవాయువును ఉత్పత్తి చేసేందుకు తూత్తుకుడి వేదాంత స్టెరిలైట్ కాపర్ యునిట్‌ను తమిళనాడు ప్రభుత్వం ఎందుకు తమ అధీనంలోకి తీసుకోలేకపోతుందని ప్రశ్నించింది.
పర్యావరణ కాలుష్యంపై వివాదంతో 2018, మేలో మూతపడిన వేదాంత స్టెరిలైట్ యూనిట్‌ను ఆక్సిజన్ ఉత్పత్తి కోసం తెరవాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
" వేదాంత, ఇతర ఏ, బీ, సీ సంస్థలను నడిపించటంపై మాకు ఎలాంటి ఆలోచన లేదు. మా ఆలోచనంతా ఆక్సిజన్ ఉత్పత్తి చేయటంపైనే. ఆక్సిజన్ లేక ప్రజలు చనిపోతున్నందున పటిష్ఠ చర్యలు చేపట్టాలి. "
- ధర్మాసనం.
తూత్తుకుడిలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, ఈ విషయంలో ప్రజలతో ఆ జిల్లా కలెక్టర్ మాట్లాడేందుకు శుక్రవారం ఉదయం వెళ్లారని కోర్టుకు తెలిపారు తమిళనాడు తరఫు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్. ప్రజలు ఆందోళన చేసే అవకాశం ఉందన్నారు. కేంద్రంతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. గురువారం విచారణ సందర్భంగా శాంతిభద్రతల అంశాన్ని ఎందుకు తెలపలేదని ప్రశ్నించింది ధర్మాసనం. ప్రస్తుతం పరిస్థితులు వేరని స్పష్టం చేసింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేస్తానని న్యాయవాది తెలిపారు.