దేశంలో కరోనా కల్లోలంపై సుమోటోగా చేపట్టిన కేసు విచారణను సుప్రీంకోర్టు.. ఈనెల 27కు వాయిదా వేసింది. ఈ కేసును శుక్రవారం పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకుగాను కేంద్రం మరింత గడువు కోరడం వల్ల విచారణ వాయిదా వేసింది.
తప్పుకున్న అమికస్ క్యూరీ..
ఈ విచారణ నుంచి ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే అమికస్ క్యూరీగా తప్పుకొన్నారు. దేశం ప్రస్తుతం అత్యంత అయోమయ స్థితిలో ఉందన్న సాల్వే.. న్యాయస్థానం విచారిస్తున్న అత్యంత క్లిష్టమైన విచారణ ఇదేనని అభిప్రాయపడ్డారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే తనకు ఎప్పటినుంచో తెలిసి ఉన్నందున ఈ విచారణ నుంచి తాను తప్పుకొంటున్నట్లు తెలిపారు.
తొలుత సాల్వే నియామకంపై ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం విచారణ ప్రారంభమైన వెంటనే అమికస్ క్యూరీగా తప్పుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ సాల్వే ధర్మాసనాన్ని కోరారు. ఆయన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. అయితే ఆయన నియామకం.. ధర్మాసనం ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమే అని తెలిపింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా మాట్లాడుతూ.. సాల్వే తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు.