Pension Scam in Palnadu: ఓ ప్రబుద్ధుడు ప్రభుత్వాన్ని మోసగిస్తున్నాడు. 21 సంవత్సరాల క్రితం మృతి చెందిన వ్యక్తి పేరుతో 12 సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పింఛను తీసుకుంటున్నాడు. ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. అంతే కాకుండా 2001లో మృతి చెందిన వ్యక్తికి 2011లో పింఛను మంజూరు చేసిన తీరు కూడా స్థానికులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
జిల్లాలోని క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన పారా కిరీటి 2001లో మృతి చెందారు. ఆయన ఎప్పుడూ పింఛను తీసుకున్న సందర్భాలు కూడా లేవు. అయితే కిరీటి మరణించిన తర్వాత ఆయన చిన్న కుమారుడు పారా సౌరయ్య ఓ ఆలోచన చేశాడు. తండ్రి పేరు మీద ఫించన్ తీసుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన మామను తండ్రిగా పరిచయం చేసి పింఛనుకు దరఖాస్తు చేసుకున్నాడు. 2011లో పింఛన్ మంజూరు చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకూ పింఛన్ కుమారుడికి చెల్లిస్తున్నారు. ఇదే అంశాన్ని గత నెలలో మృతుని బంధువులు పారా బాబూరావు, పారా జ్యోతి, పారా క్రాంతి అధికారులను కలసి మృతుని మరణ ధ్రువపత్రాన్ని కూడా అందజేశారు. అయినా ఈ నెలలో పింఛన్ తాలుకా సొమ్ము రూ.2వేల 750 ఇచ్చేశారు.
నిన్న స్పందనలో ఫిర్యాదు:అధికారులకు ఫిర్యాదు చేసినా దీనిపై స్పందించలేదని పల్నాజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.144 నెలలుగా అక్రమంగా పారా కిరీటీ పేరుతో పింఛను తీసుకుంటూ ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారని,.. చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. సుమారు 4 లక్షల రూపాయల మేర ఇప్పటి వరకు పింఛను పొందారని తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను సైతం సమర్పించారు. దీనిపై విచారణ చేయించాలని కోరారు. మోసానికి గురైన సొమ్మును రికవరీ చేసి.. నిందితుడు పారా సౌరయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ద్వారా వేడుకున్నారు.
విచారణకు ఆదేశం:పారా సౌరయ్యపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు ప్రారంభించారు. పారా కిరీటి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం విచారణ చేయించి రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని డీడీవో మహాలక్ష్మిని పల్నాడు జిల్లా జేసీ శ్యాంప్రసాద్ ఆదేశించారు.
"2011లో పారా కిరీటి చనిపోయాడు. 21 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి పేరు మీద గత 12 సంవత్సరాలుగా దాదాపు 4లక్షల రూపాయల వరకు పింఛన్ తీసుకున్నారు. ఈ విషయంపై స్పందనలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాము. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించారు. దీనిపై స్పందించిన ఆయన తగిన విచారణ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు"-పారా కిరీటీ కుటుంబసభ్యులు