CJI NV RAMANA NEWS : దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో కీలక అధ్యాయం లిఖితమైంది. కోర్టు చరిత్రలో తొలిసారిగా.. ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రత్యక్షప్రసారాల కోసం చాలా కాలం నుంచి కృషిచేస్తూ వచ్చిన జస్టిస్ ఎన్‌వీ రమణ.. తాను పదవీ విరమణ చేస్తున్న రోజు ఈ ప్రక్రియకు కార్యరూపం ఇచ్చారు. ఫలితంగా ఆయన నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం చేపట్టిన కేసుల విచారణను ప్రత్యక్షప్రసారం చేశారు. రాజకీయ పార్టీల ఉచిత హామీలు, కర్ణాటకలో ఇనుప గనుల మైనింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యల కేసుల విచారణను ప్రత్యక్షప్రసారం ద్వారా ప్రజలు వీక్షించే వెసులుబాటు కల్పించారు.
CJI farewell speech : విచారణ అనంతరం మాట్లాడిన సీజేఐ అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని ఆకాంక్షించారు. సాంకేతిక మార్పులను న్యాయవ్యవస్థ అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆ దిశలో తాను శాయశక్తులా కృషి చేశానని గుర్తుచేసుకున్నారు. పెండింగ్ కేసులు పెద్ద సవాలుగా నిలిచాయన్న ఆయన.. కేసుల లిస్టింగ్, విచారణ తేదీల ఖరారుపైఎక్కువ దృష్టి కేంద్రీకరించలేకపోయినట్లు విచారం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా తన హయాంలో 50 రోజుల కంటే ఎక్కువ పూర్తిస్థాయి విచారణ జరగకపోవడం పట్ల కూడా జస్టిస్ ఎన్‌వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ కేసుల సమస్య పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీంకోర్టు విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్న జస్టిస్ రమణ లేనిపక్షంలో ప్రజల నుంచి గౌరవాన్ని ఆశించలేమని స్పష్టం చేశారు.
"న్యాయవ్యవస్థ కార్యకలాపాల్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఏకైక మార్గం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున ఉపయోగించడమే. కృత్రిమ మేధస్సును ఉపయోగించి అన్నింటికీ పరిష్కారం చూపాలి. ఈ దిశలో కొన్ని మాడ్యూల్స్‌ను అభివృద్ధి చేసినప్పటికీ భద్రతాపరమైన అంశాల దృష్ట్యా మరింత పురోగతి సాధించలేక పోయాం. కేసుల్లో సంవాదాలు, చర్చలను మరింత త్వరగా పూర్తిచేసి సామాన్యులకు త్వరితగతిన ఆర్థికంగా భారం కాకుండా న్యాయం అందించేందుకు మనమంతా ప్రయత్నించాలి. సుప్రీంకోర్టు అభివృద్ధిలో నేనొక్కడిని మాత్రమే కాదు.. ఎంతోమంది గొప్పవారు త్వరగా న్యాయం అందించేందుకు తమ వంతుగా ఎంతో కృషిచేశారు. ప్రధాన న్యాయమూర్తిగా నా పదవీకాలమైన గత 16 నెలల్లో 50 రోజులు మాత్రమే పూర్తిస్థాయి విచారణలు జరగడం బాధాకరం. ప్రధాన న్యాయమూర్తులు వస్తారు, వెళతారు కానీ సుప్రీంకోర్టు శాశ్వతం. ప్రతిఒక్కరూ ఈ వ్యవస్థకు ఎంతో కొంత తమ భాగస్వామ్యాన్ని అందిస్తారు. ఈ విషయంలో నా శాయశక్తులా కృషిచేశాను."
--జస్టిస్ ఎన్‌వీ రమణ, సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి