pegasus spyware case: గతేడాది యావత్ దేశాన్ని కుదిపేసిన పెగసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్‌ను భారత్ 2017లోనే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం వెల్లడించింది. ఓ రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతో పాటు పెగసస్‌కు కూడా డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపింది. పెగసస్ తయారీ సంస్థ ఎస్‌ఎస్‌వోతో తమకు ఎలాంటి లావాదేవీలు జరగలేదని కేంద్రం చెప్పిన నేపథ్యంలో తాజా కథనం సంచలనాత్మకంగా మారింది.
Pegasus spyware New York times
న్యూయార్క్ టైమ్స్ నివేదికపై కాంగ్రెస్ పార్టీ.. అధికార భాజపాపై తీవ్రంగా మండిపడింది. మోదీ సర్కారు భారతదేశానికి శత్రువులా ఎందుకు ప్రవర్తిస్తోందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
"పెగసస్ లాంటి ఆయుధాన్ని కేంద్రం భారతీయులపై ఎందుకు ప్రయోగిస్తోంది. ఇతరుల వ్యక్తిగత విషయాలను పెగసస్ ద్వారా తెలుసుకోవడం చట్టవిరుద్ధమైన చర్య. ఇది దేశద్రోహానికి సమానమే. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. బాధితులకు న్యాయం జరుగుతుంది."
-మల్లికార్జున ఖర్గే, రాజ్యసభలో విపక్ష నేత
Pegasus spyware case congress
రాహుల్‌గాంధీ సహా దేశంలోని ప్రముఖులపై భాజపా సర్కారు స్పైవేర్ ప్రయోగించిందనడానికి ఇదే నిజమైన సాక్ష్యమని న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఉటంకిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ ఆరోపించారు. దీనికి కేంద్రం బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు.
pegasusu spyware India
ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును, పార్లమెంటును కేంద్రం తప్పుదోవ పట్టించిందని ఈ నివేదిక స్పష్టం చేస్తోందని రాజ్యసభ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ తెలిపారు. ఈ విషయంలో ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వడం ప్రధానమంత్రి కార్యాలయం విధి అని పేర్కొన్నారు. దేశ ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి రూ.300 కోట్ల స్పైవేర్ కొనుగోలు చేశారని గోహిల్ ట్వీట్ చేశారు.
స్పైవేర్‌ను రక్షణపరంగా కాకుండా ప్రతిపక్షాలు, పాత్రికేయులపై నిఘా పెట్టేందుకు కేంద్రం ఉపయోగిస్తోందని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్‌లో ఆరోపించారు. దేశాన్ని భాజపా బిగ్‌బాస్ షో లాగా మార్చేసిందని ఆమె మండిపడ్డారు.
న్యూయార్క్ టైమ్స్ కథనంలో ఏముందంటే..
New York times report Pegasus
పెగసస్ వ్యవహారంపై దాదాపు ఏడాది పాటు దర్యాప్తు జరిపి ఈ కథనం రూపొందించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. "ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ గత దశాబ్ద కాలంగా నిఘా సాఫ్ట్‌వేర్‌లను సబ్‌స్క్రిప్షన్ విధానంలో చట్టసభలు, నిఘా సంస్థలకు విక్రయిస్తోంది. అమెరికా ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కు ఈ స్పైవేర్‌ను విక్రయించగా.. దీన్ని వినియోగించలేదు. భారత్ కూడా దీన్ని కొనుగోలు చేసింది. భారత్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. 2017న జులైలో మోదీ తొలిసారిగా ఇజ్రాయెల్ వెళ్లారు. ఓ భారత ప్రధాని ఇజ్రాయెల్‌లో పర్యటించడం అదే తొలిసారి. ఆ సమయంలోనే ఇరు దేశాల మధ్య అధునాతన ఆయుధాల, సాంకేతిక మార్పిడి కోసం ఇజ్రాయెల్‌తో మోదీ 2 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ డీల్‌లోనే పెగసస్, క్షిపణి వ్యవస్థ కూడా ప్రధానంగా ఉన్నాయి. ఈ ఒప్పందం జరిగిన కొన్ని నెలల తర్వాత అప్పటి ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ భారత్‌లో పర్యటించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. 2019 జూన్‌లోనే ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు అబ్జర్వర్ హోదాపై జరిగిన ఓటింగ్‌లో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా భారత్ ఓటువేసింది" అని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొన్నట్లు పీటీఐ న్యూస్ వార్తా కథనం వెల్లడించింది.
ప్రభుత్వం ఏమందంటే..
దీనిపై కేంద్ర ప్రభుత్వ స్పందన కోరినా.. ఎలాంటి సమాధానం రాలేదని పీటీఐ తెలిపింది. అయితే ఈ నివేదిక పూర్తిగా నిరాధారమని ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారిక వర్గాలు కొట్టిపారేసినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలు రహస్యంగా ఉండబోవని పేర్కొన్నాయి. అంతేగాక, స్థానిక నిపుణులను సంప్రదించకుండా థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం కొనుగోలు చేయదని స్పష్టం చేశాయి. పెగసస్‌ను రూపొందించింది ఓ ప్రైవేటు సంస్థ అని, దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ప్రత్యక్ష, పరోక్ష ఒప్పందాలేవి జరగలేదని సదరు వర్గాలు తెలిపాయి.
ఇదీ వివాదం..
ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్ రూపొందించిన ఈ స్పైవేర్‌ను కొన్ని దేశాలు వినియోగించుకుని.. రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టినట్లు గతేడాది జులైలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం తీవ్ర దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఇలా దేశంలో దాదాపు 300 మంది ఫోన్లను పెగసస్‌తో హ్యాక్ చేసినట్లు అప్పట్లో 'ది వైర్' కథనం వెల్లడించింది. ఇది తీవ్ర వివాదం రేపడంతో పాటు పార్లమెంట్‌ను కూడా కుదిపేసిన విషయం తెలిసిందే. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే ఈ ఆరోపణలను కేంద్రం ఎప్పటికప్పుడు తోసిపుచ్చింది. ఆ వార్తలు నిజం కాదని తెలిపింది. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరగా.. పెగసస్‌ను వినియోగించారా? లేదా? అన్నదానిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:రైల్లో చెలరేగిన మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగు