దేశంలోని పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్ల హ్యాకింగ్‌పై దుమారం చెలరేగింది. ఈ అంశంపై భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ వ్యవహారంలో ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి హస్తం ఉందని ఆరోపించారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే. అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
" రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, కేంద్ర మంత్రులపైనా.. ప్రధాని, హోంమంత్రి దాడులు చేస్తున్నారు. ఫోన్ల ట్యాపింగ్‌పై దర్యాప్తు చేపట్టే ముందే అమిత్ షా రాజీనామా చేయాలి. మోదీపైనా ఈ దర్యాప్తు జరగాలి. "
- మల్లికార్జున్ ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత
డిజిటల్ ఇండియాను ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తానని చెప్పారని, కానీ, ప్రస్తుతం నిఘా భారత్‌ను చూస్తున్నామని ఆరోపించారు లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి. తమ ఉత్పత్తులను ప్రభుత్వం ప్రత్యేకంగా నేరాలు, ఉగ్రవాదాన్ని నిరోధించేందుకే వినియోగిస్తోందని ఎన్ఎస్ఓ చెబుతోందని, కానీ, వారు పెగాసస్‌ను మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు. విపక్షాల తరఫున పార్లమెంట్లో ఈ విషయాన్ని లేవనెత్తుతామని తెలిపారు.