తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పెగాసస్​ ప్లేస్​లో కొత్త స్పైవేర్.. వారిపై నిఘా కోసం కేంద్రం ఖర్చు రూ.వెయ్యి కోట్లు!' - మోడీ కాగ్నైట్ సాఫ్ట్​వేర్

ఇజ్రాయెల్​కు చెందిన కొత్త స్పైవేర్​ను కొనుగోలు చేసేందుకు మోదీ సర్కారు సిద్ధమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇందుకోసం రూ.986 కోట్లు వెచ్చించనున్నారని తెలిసిందని పేర్కొంది. దేశ పౌరులపై నిఘా పెట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది.

pegasus indian government
pegasus indian government

By

Published : Apr 10, 2023, 5:05 PM IST

పెగాసస్ తరహాలో పనిచేసే కొత్త నిఘా సాఫ్ట్​వేర్​ను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇజ్రాయెల్​కే చెందిన కాగ్నైట్ (Cognyte) అనే స్పైవేర్​ను మోదీ సర్కారు కొనుగోలు చేసేందుకు సిద్ధమైందని మండిపడింది. మీడియా సంస్థలు, పౌర హక్కుల కార్యకర్తలు, న్యాయ వ్యవస్థలపై నిఘా పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తింది. ఇందుకోసం రూ.986 కోట్లు వెచ్చించేందుకు మోదీ సర్కారు ప్రణాళికలు రచిస్తోందని కాంగ్రెస్ పార్టీ మీడియా ఇంఛార్జ్ పవన్ ఖేడా ఆరోపించారు.

"పెగాసస్ స్పైవేర్, కేంబ్రిడ్జ్ అనలిటికా, టీమ్ జార్జ్ తరహాలోనే మోదీ ప్రభుత్వం మరో స్పైవేర్ కొనేందుకు సిద్ధమైందా? కొత్త ట్రేడ్ రిపోర్టులను పరిశీలిస్తే అది నిజమనే అనిపిస్తోంది. అనేక దేశాలు నిషేధం విధించిన పెగాసస్ కాకుండా.. కొంచెం లో ప్రొఫైల్ ఉన్న స్పైవేర్ కోసం ప్రభుత్వం వెతుకుతోంది. పెగాసస్​కు పోటీదారు అయిన సంస్థ నుంచి రూ.986 కోట్లకు స్పైవేర్​ను కొనుగోలు చేసేందుకు రక్షణ, నిఘా వర్గాలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించి మోదీ సర్కారు చివరి విడత చర్చలు జరుపుతోంది. రక్షణ శాఖ దీనిపై ప్రతిపాదనలు పంపుతోందని సమాచారం. ఇందులో ఎంత నిజం ఉంది?"
-పవన్ ఖేడా, కాంగ్రెస్ మీడియా ఇంఛార్జ్

పొలిటికల్ కన్సల్టింగ్ కంపెనీ అయిన కేంబ్రిడ్జ్ అనలిటికాతో బీజేపీకి ఉన్న సంబంధాలను 2018లోనే బట్టబయలు చేశామని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్​కు చెందిన టీమ్ జార్జ్ అనే హ్యాకర్ల బృందం బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ ఎన్నికల్లో జోక్యం చేసుకుందని ఆరోపించింది. దేశంలో ఇద్దరు గూఢచారులు ఉన్నారని, వారు ఎవరిపైనా నమ్మకం ఉంచరని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు పవన్ ఖేడా. తమ గుట్టు బయటపడుతుందేమోనన్న భయంతోనే వారు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.

"2014 సార్వత్రిక ఎన్నికల్లో కేంబ్రిడ్జ్ అనలిటికా బీజేపీ తరఫున ఏ విధంగా ప్రచారం చేసిందో మనం చూశాం. బిహార్, ఝార్ఖండ్, దిల్లీ, హరియాణా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల ఎన్నికల్లోనూ వారు ప్రభావం చూపించారు. తప్పుడు వార్తల వ్యాప్తి కోసం బీజేపీ ఎకోసిస్టమ్ ఉపయోగించే టీమ్ జార్జ్ హ్యాకర్ల గుట్టును సైతం మేమే బట్టబయలు చేశాం. రాజ్యాంగ విరుద్ధంగా నిఘా పెట్టాలని ప్రయత్నిస్తూ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మరోసారి దేశ ప్రజల ముందు దోషిగా నిలబడింది. పెగాసస్​ను కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని ప్రధాని, హోంమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు ఎందుకు ఆమోదించారు? ఇప్పుడు 'కాగ్నైట్', 'ప్రిడేటర్', 'క్వాడ్రీమ్' వంటి ప్రత్యామ్నాయ నిఘా సాఫ్ట్​వేర్లను కొనుగోలు చేయాలని ఎవరు నిర్ణయించారు? ప్రజలపై నిఘా పెట్టేందుకు మోదీ అన్ని కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ, అదానీ షెల్ కంపెనీలకు వచ్చిన రూ.20వేల కోట్లు ఎవరివని మాత్రం చెప్పరా?"
-పవన్ ఖేడా

పౌరులపై నిఘా పెట్టేందుకు చట్టవిరుద్ధ స్పైవేర్లను ఉపయోగించినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటూ ప్రశ్నించారు పవన్ ఖేడా. 1885 టెలిగ్రాఫ్ చట్టం, 2000 ఐటీ చట్టంలోని నిబంధనలు మంత్రులకు వర్తించవా అని నిలదీశారు. పెగాసస్​ కేసులో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆ కేసును పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు కమిటీ అభిప్రాయపడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మాజీ సీజేఐ సైతం దీనిపై ఇలాగే స్పందించారని తెలిపారు. దర్యాప్తు కమిటీ నివేదికను ఇప్పటికీ సీల్ వేసి ఉంచడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details